ముక్తిమార్గం.. ఉత్తర ద్వారదర్శనం
● నేడు వైకుంఠ ఏకాదశి పర్వదినం
● ఉత్తరద్వార దర్శనానికి ఆలయాల్లో ఏర్పాట్లు
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లా వ్యాప్తంగా మంగళవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని జరుపుకోనున్నారు. దీనిని ముక్కోటి ఏకాదశి కూడా అంటారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని పట్టణంలోని పలు వైష్ణవాలయాల్లో ఉత్తరద్వార దర్శనంతోపాటు ప్రత్యేక పూజలు ఏర్పాటు చేశారు. బ్రాహ్మణవాడి వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో పల్లకీసేవ అనంతరం ఉత్తరద్వార దర్శనసేవలు నిర్వహిస్తారు. శ్రీనివాసకాలనీ పంచముఖాంజనేయ స్వామి ఆలయంలో ఉదయం, సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణాలు నిర్వహించనున్నారు. సింహగిరి లక్ష్మీనరసింహస్వామిహాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహించనున్నారు. ప్రత్యేక పూజలు చేసి వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తారు. అదేవిధంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఉత్తరదార్వ దర్శనాలు కల్పించనున్నారు.
వేంకటేశ్వరస్వామి ఆలయంలో
వేడుకలు
పిల్లలమర్రి రోడ్డులోని శ్రీకంచికామకోటి పీఠం వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి ఉత్తరద్వార దర్శనానికి అనుమతించనున్నారు. స్వామివారి దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదయం 3:30గంటలకు సేవాకర్తలచే విశేష సహస్రనామార్చన నిర్వహించనున్నారు. ఉదయం 5గంటల తర్వాత సర్వదర్శన కార్యక్రమం ప్రారంభమవుతుందని, భక్తులు ఉదయం 6గంటల తర్వాత దర్శనానికి రావాలని వేంకటేశ్వర సేవా మండలి సభ్యులు సూచించారు. 31వ తేదీ ఉదయం 7గంటలకు శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్నారు.
కురుమూర్తి ఆలయంలో పూలతో
అలంకరించిన వైకుంఠ దర్శన మండపం
చిన్నచింతకుంట: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని చిన్నచింతకుంట మండలం కురుమూర్తి స్వామి ఆలయంలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు. అందుకు ఆలయంలో సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారి ప్రధాన ఆలయ మండపంలో ఉత్తర ద్వార దర్శనం మండపాన్ని వివిధ రకాల పూలతో అలంకరించారు. ఉత్తర ద్వార దర్శనంతోపాటు స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని ఆలయ ఈఓ మధనేశ్వరెడ్డి, చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.
ముక్తిమార్గం.. ఉత్తర ద్వారదర్శనం
ముక్తిమార్గం.. ఉత్తర ద్వారదర్శనం


