గుప్తనిధుల తవ్వకాలు చేపట్టిన నిందితుల విచారణ
అచ్చంపేట రూరల్/కొల్లాపూర్ రూరల్: కొల్లాపూర్ మండలంలోని మొలచింతపల్లి సమీపంలో దాదాపు 10కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లమల అడవీలో దేవునిబొక్కలో ఉన్న చెంచులు ఆరాధించే పురాతన శివాలయంలో కొందరు మూడురోజులుగా గుప్తనిధుల కోసం తవ్వకాలు చేస్తున్నారు. ఫారెస్టు అధికారులు ఆదివారం అక్కడికెళ్లి 15మంది దుండగులను పటుకుని అదుపులోకి తీసుకొన్నారు. కొల్లాపూర్ నుంచి రెండు వాహనాల్లో వారిని సోమవారం డీఎఫ్‌ఓ కార్యాలయానికి తీసుకొచ్చారు. వారివద్ద ఉన్న పరికరాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులను ఎఫ్‌డీఓ చంద్రశేఖర్, ఇతర అధికారులు వేర్వేరుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా విచారించారు. ఉదయం నుంచి రాత్రి వరకు సుదీర్ఘంగా పలు దఫాలుగా విచారణ చేశా రు. కొల్లాపూర్ మండలం కుడికిల్లకు చెందిన సాంబశివుడు, పాన్‌గల్ మండలం రాయినిపల్లికి చెందిన 15మంది తన అనుచరులతో కలిసి ఒక్కొక్కరికి రూ.10వేలు అడ్వాన్స్ ఇచ్చి తవ్వడానికి తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. వేర్వేరుగా వారినుంచి వివరాలు రాబట్టారు. అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లలేని ప్రదేశంలో ఉన్న పవిత్రమైన శివాలయం వద్దకు ఎలా వెళ్లారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అటవీ ప్రాంతంలోకి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారు టీంగా ఏర్పడి వెళ్లారని, శనివారం సాయంత్రం నుంచి ఆలయం వద్ద తవ్వకా లు జరిపారని ప్రాథమికంగా అంచనాకు అధికా రులు వచ్చారు. కాగా, కట్టుదిట్టంగా ఉన్న సెక్షన్, బీట్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది నిర్లక్ష్యం ఏమైనా ఉందా? అనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు. ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నామని, అటవీ ప్రాంతంలోకి వెళ్లినవారిని ఎవరైనా ప్రోత్సహించారా? వారికి డబ్బులు, వస్తువులు ఎవరు సమకూర్చారనే కోణంలో విచారణ చేపడుతున్నట్లు ఎఫ్‌డీఓ చంద్రశేఖర్ తెలిపారు. విచారణ పూర్తయ్యాక పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. సిబ్బంది అలసత్వం ఉన్నట్లు రుజువైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం కొల్లాపూర్ కోర్టులో హాజరుపర్చనున్నట్లు అధికారులు తెలిపారు.
గుప్తనిధుల తవ్వకాలు చేపట్టిన నిందితుల విచారణ


