
వృద్ధురాలితో హోం ఓటింగ్ నిర్వహిస్తున్నఅధికారులు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో 80 సంవత్సరాలు పైబడిన, దివ్యాంగ ఓటర్లకు కల్పించిన హోం ఓటింగ్ ప్రక్రియను మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో గురువారం ప్రారంభించినట్లు రిటర్నింగ్ అధికారి అనిల్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హోం ఓటింగ్‌లో భాగంగా గురువారం వరకు 32 మంది హోం ఓటింగ్‌లో పాల్గొన్నారన్నారు. మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 93 మంది సీనియర్ సిటిజన్లు, 135 మంది దివ్యాంగ ఓటర్లు మొత్తం కలిపి 228 మంది హోం ఓటింగ్ ఎంచుకోవడం జరిగిందన్నారు. ఇందుకు 7 బృందాలను ఏర్పాటు చేశామని, ఒక్కో బృందంలో పీఓ, ఏపీఓ, ఓపీఓ, మైక్రో అబ్జర్వర్, ఒక పోలీసు, వీడియో కెమెరాతో సహా హోం ఓటింగ్ ఎంపిక చేసుకున్న వారితో ఓటు వేయిస్తారని చెప్పారు. మూడు రోజులపాటు హోం ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తామని వివరించారు.
నేడు కొనసాగనున్న ఫెసిలిటేషన్ కేంద్రం
ఎన్నికల విధులకు నియమించిన ఉద్యోగులకు కల్పిస్తున్న పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు శుక్రవారం సైతం ఎంవీఎస్ కళాశాలలో ఫెసిలిటేషన్ సెంటర్ కొనసాగిస్తున్నట్లు మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అనిల్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర నియోజకవర్గాల నుంచి మహబూబ్‌నగర్‌లో విధులు నిర్వహించేందుకు వచ్చిన వారి కోసం ఎంవీఎస్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తూ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులు పోస్టర్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.