Telangana News: దొరల పాలన కావాలా.. ప్రజల తెలంగాణ కావాలో తేల్చుకోండి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
Sakshi News home page

దొరల పాలన కావాలా.. ప్రజల తెలంగాణ కావాలో తేల్చుకోండి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

Nov 8 2023 1:42 AM | Updated on Nov 8 2023 12:44 PM

- - Sakshi

గద్వాలలో నిర్వహించిన రోడ్‌షోలో అభివాదం చేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌: ‘కొడంగల్‌ నియోజకవర్గం నారాయణపేట జిల్లాలో ఉంది.. ఈ ప్రాంత బిడ్డనైన నేను టీపీసీసీ అధ్యక్షుడినయ్యా.. పాలమూరులో 14 సీట్లు గెలవకపోతే ఎక్కిరిస్తరు.. ఈ గడ్డ మీద గ్రూపులు లేవు.. ముఠా తగాదాలు లేవు.. మనమందరం ఏకం కావాలి.. పాలమూరు 14 సీట్లు గెలవాలి.. వలసలు ఆగుతాయ్‌.. బీడు భూములు పండుతాయ్‌.. నారాయణపేట, కొడంగల్‌ పథకం తెస్తే పడావు పెట్టిండు.. ఆ పథకం రావాలంటే 14 సీట్లు గెలవాలి’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.

మంగళవారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అలంపూర్‌ నియోజకవర్గం శాంతినగర్‌, గద్వాల, మక్తల్‌లో నిర్వహించిన ‘పాలమూరు ప్రజా గర్జన’ బహిరంగ సభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకు ముందు అలంపూర్‌ జోగళాంబ అమ్మవారి ఆలయంలో కాంగ్రెస్‌ అభ్యర్థి సంపత్‌కుమార్‌తో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే షా–అలీ పహిల్వాన్‌ దర్గాలో ప్రార్థనలు జరిపారు.

అనంతరం వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లో ప్రచార రథంలో రోడ్‌షో నిర్వహించారు. ఆయా సందర్భాల్లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ పదేళ్ల పాలనలో డబుల్‌ బెడ్రూం, మూడెకరాల భూమి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో దొరల పాలన కావాలో.. ప్రజల తెలంగాణ కావాలో నిర్ణయించుకోవాలని సూచించారు.

అలంపూర్‌ను ఎడారిగా మార్చారు
పదేళ్ల పాలనలో అలంపూర్‌ను ఎడారిగా మార్చిన బీఆర్‌ఎస్‌ను బొందపెట్టాలనే పట్టుదల ఇక్కడున్న అందరిలో కనిపిస్తుందని రేవంత్‌రెడ్డి అన్నారు. 2014లో కేసీఆర్‌ తుమ్మిళ్ల ప్రాజెక్టు ఇస్తానని మాట ఇవ్వడంతో పాటు.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తే ఆర్డీఎస్‌పై కుర్చీ వేసుకొని నీళ్లు పారిస్తానని హామీ ఇచ్చి మరిచిపోయారని దుయ్యబట్టారు. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న సంపత్‌కుమార్‌ సింధనూరు వద్ద ఆర్డీఎస్‌ కాల్వలో కేసీఆర్‌ కోసం కుర్చీ వేసి దీక్ష చేపట్టినట్లు గుర్తుచేశారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తుమ్మిళ్ల ఎత్తిపోతలు మంజూరు చేసినా పూర్తిస్థాయిలో నిర్మించలేదని, అలంపూర్‌కు వంద పడకల ఆస్పత్రి నిర్మించి ప్రారంభిస్తే డాక్టర్లు, సిబ్బంది లేక అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని విమర్శించారు. నడిగడ్డలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే మంచి సంకల్పంతో సంపత్‌ కొట్లాడుతున్నారని, ఆయన ఓటేసి అండగా ఉండాలని కోరారు.

2009లో సంపత్‌కు కాంగ్రెస్‌ బీఫాం ఇస్తే.. చల్లా వెంకట్రామిరెడ్డి పట్టుబట్టి టికెట్‌ అబ్రహంకు ఇప్పించాడన్నారు. నామినేషన్‌ వేసిన సంపత్‌ తనకు బీఫాం ఇచ్చి వెనక్కి తీసుకుంటే క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా పార్టీ కోసం కట్టుబడి పని చేశారని గుర్తు చేశారు. ఆ రోజు సంపత్‌ వద్దని అబ్రహంను తెచ్చావ్‌. ఈ రోజు అబ్రహం వద్దని ఇంకొకరిని తీసుకొస్తున్నావ్‌.. ఏంది నీ కుట్ర అని చల్లానుద్దేశించి ప్రశ్నించారు. ఎందుకోసం పార్టీ మారావని, ఆ మాత్రం ఎమ్మెల్సీ పదవీ కాంగ్రెస్‌ పార్టీ ఇవ్వకుండేనా అని నిలదీశారు.

కాంగ్రెస్‌ పార్టీ మీ తాతను రాష్ట్రపతిని చేసింది.. మీ తండ్రిని ఈ ప్రాంత ప్రజలు భుజాలపై మోశారన్నారు. కాంగ్రెస్‌ చల్లా వెంకట్రామిరెడ్డికి ఏం తక్కువ చేసిందని దుయ్యబట్టారు.

నిండు మనసుతో ఆశీర్వదించండి..
వేలాది మంది రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు నిండు మనసుతో కాంగ్రెస్‌ పార్టీని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని రేవంత్‌రెడ్డి అన్నారు. మా సీతక్క, ప్రశాంత్‌రెడ్డి, మల్లురవి, జెడ్పీ చైర్‌పర్సన్‌, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, జిల్లా పార్టీ నాయకులు సభ విజయవంతానికి కృషి చేసిన అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా అన్నారు.

కొత్తకోట దయాకర్‌రెడ్డి తనకు పెద్దన్న అని.. ఆ కుటుంబం కూడా పెద్ద మనసు చేసుకొని శ్రీహరిని గెలిపించేందుకు ముందుకు వచ్చారన్నారు. మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి తనయుడు ప్రశాంతరెడ్డి టికెట్‌ ఆశించి కూడా శ్రీహరి గెలుపుకోసం పనిచేయడానికి ముందుకు వచ్చారని కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement