అయిజలో భారీ అగ్నిప్రమాదం
● దగ్ధమైన పరమేశ్వర పైపుల ఇండస్ట్రీ
● సుమారు రూ.ఆరు కోట్ల నష్టం
● ఘటనా స్థలాన్ని పరిశీలించినఎమ్మెల్యే విజయుడు
మంటల్లో దగ్ధమవుతున్న పైపుల ఫ్యాక్టరీ
అలంపూర్(అయిజ): అగ్ని ప్రమాదం సంభవించి పైపుల ఫ్యాక్టరీ మంటల్లో కాలిపోయి సుమారు రూ.6కోట్ల ఆస్తినష్టం జరిగిన ఘటన పట్టణ సమీపంలో చోటుచేసుకుంది. మండలంలోని భూంపురం గ్రామానికి చెందిన ప్రతాపరెడ్డి ఏడాది కిందట పట్టణ సమీపంలో రాయిచూర్ రోడ్డు పక్కన పరమేశ్వర ఇండస్ట్రీ పేరుతో డ్రిప్‌పైపుల ఫ్యాక్టరీని స్థాపించారు. శనివారం ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ సంభంవించింది. ఫ్యాక్టరీలో పనిచేసే సిబ్బంది వెంటనే బయటకు వెళ్లిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. మంటలు తీవ్రమై దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఆర్పేందుకు వీలులేకుండా పోయింది. మంటలు వ్యాపించిన గంట తర్వాత రెండు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశాయి.
సుమారు రూ.6కోట్లు ఆస్తినష్టం
ఫ్యాక్టరీలో అమర్చిన యంత్రాలు, తయారు చేసిన పైపులు, పైపులు చేసేందుకు ఉపయోగించే ముడిసరుకు కలపి మొత్తం రూ.6కోట్లు నష్టం వాటిల్లింది. ముఖ్యంగా 10వేల డ్రిపై పైపుల చుట్టలు, వెయ్యి ప్యాకెట్లు ముడిసరుకు, 240 బ్యాగుల వర్జిన్‌తోపాటు ముడిసరుకును తయారు చేసే 2 మిషన్‌లు, డ్రిప్ పైపులు తయారు చేసే మిషన్, ప్యానల్ బోర్డ్, ఎయిర్ కంప్రీషర్ సెట్ తదితర వస్తువులు మంటల్లో కాలిపోయాయి.
సందర్శించిన అలంపూర్ ఎమ్మెల్యే
ఘటన స్థలాన్ని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సందర్శించారు. బాధితుడితో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. అయిజలో ఒకటి, అలంపూర్‌లో ఒకటి ఫైర్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంతురెడ్డిని అడిగామని, ఇంతవరకు ఎలాంటి స్పందనలేదని ఎమ్మెల్యే వాపోయారు. బాధిత కుటుంబానికి నష్టరిహారం అందించేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఘటనా స్థలాన్ని శాంతినగర్ సీఐ టాటాబాబు, స్థానిక ఎస్‌ఐ శ్రీనివాసులు సందర్శించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే వెంట బీఆర్‌ఎస్ నాయకులు, కార్యర్తలు పాల్గొన్నారు.
అయిజలో భారీ అగ్నిప్రమాదం


