రూ.3.46కోట్ల విలువైన సొత్తు స్వాధీనం | Sakshi
Sakshi News home page

రూ.3.46కోట్ల విలువైన సొత్తు స్వాధీనం

Published Tue, Nov 7 2023 1:38 AM

-

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): శాసనసభ ఎన్నికలలో భాగంగా రూ.50 వేల మించి తీసుకెళ్తున్న నగదు సీజ్‌లో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు రూ.3కోట్ల46లక్షల1,065 నగదు, రూ.24,76,260 విలువ చేసే ఆభరణాలు మొత్తం సాధీనం చేసుకున్నట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి రవినాయక్‌ సోమవారం ప్రకటనలో వెల్లడించారు. ఇందులో 112 నగదు కేసులు ఉండగా, 5 ఆభరణాలకు కేసులు ఉన్నాయని తెలిపారు. సీజ్‌ చేసిన నగదులో ఇప్పటి వరకు 110 నగదు కేసులకు సరైన సాక్షాధారాలు, రుజువులు సమర్పించినందున రూ.3కోట్ల16లక్షల895 విడిచిపెట్టినట్లు, ఆభరణాలకు సంబంధించి నాలుగు కేసులలో రూ.16,80,260 విలువైన ఆభరణాలు విడిచిపెట్టామని తెలిపారు. ఇంకా రెండు కేసులకు సంబంధించి రూ.30లక్షల170, ఒక నగల కేసుకు సంబంధించి రూ.7.96 లక్షల నగదు, ఆభరణాలను విడుదల చేయాల్సిందని, వారు ఇంకా సరైన రుజువు సమర్పించనందున వాటిని విడుదల చేయలేదని, రుజువులు సమర్పించిన వెంటనే వాటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు.

గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టుల

భర్తీకి దరఖాస్తులు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాలలో పలు సబ్జెక్టులకు గెస్టు లెక్చరర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ పద్మావతి ప్రకటనలో తెలిపారు. తెలుగు, పొలిటికల్‌ సైన్స్‌, ఎకానామిక్స్‌, కామర్స్‌ విభాగాలలో సబ్జెక్టులు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి గల వారు ఈనెల 8వ తేదీలోపు దరఖాస్తు చేసుకుని, 9న అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుందని తెలిపారు.

ఉత్సాహంగాక్రీడాకారుల ఎంపికలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో సోమవారం స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌–17, అండర్‌–19 విభాగాల ఉషు (మార్షల్‌ ఆర్ట్స్‌) క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా అండర్‌–19 ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పాపిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రస్థాయి వుషు టోర్నీలో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటి పతకాలు సాధించాలని కోరారు. కార్యక్రమంలో అండర్‌–14, అండర్‌–17 ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రమేశ్‌బాబు, సయ్యద్‌ ఖలీల్‌, ఇలియాజ్‌, సలీం, వాజిద్‌ తదితరులు పాల్గొన్నారు.

పోటెత్తిన ధాన్యం

దేవరకద్ర: పట్టణంలోని మార్కెట్‌ యార్డుకు సోమవారం వరి ధాన్యం పోటెత్తింది. కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు కింద వేసిన వరి పంటలు కోతలు ప్రారంభం కావడంతో రైతులు పెద్ద ఎత్తున ధాన్యంను అమ్మకానికి తెస్తున్నారు. దాదాపు పది వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. సోనామసూరి ధాన్యం క్వింటాల్‌కు గరిష్టంగా రూ. 2273, కనిష్టంగా రూ. 1850గా ధరలు నమోదు అయ్యాయి. హంస ధాన్యం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.1859, కనిష్టంగా రూ. 1511గా పలికింది. ఆముదాల క్వింటాల్‌కు రూ. 5329 గా ఒకే ధర వచ్చింది

Advertisement
 
Advertisement