ఈతకు వెళ్లి బాలుడి మృతి | - | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి బాలుడి మృతి

Mar 29 2023 1:16 AM | Updated on Mar 29 2023 1:16 AM

వీరు(ఫైల్‌)  - Sakshi

వీరు(ఫైల్‌)

గోపాల్‌పేట: ఈతకు వెళ్లి బాలుడు మరణించిన ఘటన రేవల్లి మండలంలోని గొల్లపల్లిలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. రేవల్లి ఎస్‌ఐ శివకుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. గొల్లపల్లికి చెందిన స్వామి, కావ్యలకు కుమారుడు, కూతురు ఉన్నారు. కుమారుడు వీరు(9) గొల్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఈత కోసం తోటి పిల్లలతో పాటు కలిసి బావికి వెళ్లారు. ప్రమాదవశాత్తు వీరు బావిలో పడిపోయాడు. పక్కనున్న పిల్లలు వెంటనే కేకలు వేయగా చుట్టుపక్కల ఉన్నవారు వచ్చి చేసేసరికి మునిగిపోయాడు. బావిలోకి దిగి వెతికి బయటకు తీయగా, అప్పటికే మృతిచెందాడు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

నీటి సంపులో పడి మహిళ..

రాజాపూర్‌: ప్రమాదవశాత్తు నీటిసంపులో పడి మహిళ మృతిచెందిన సంఘటన మంగళవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన లక్ష్మమ్మ(70) తన కుమారుడు నూతనంగా నిర్మిస్తున్న ఇంటి ఎదుట నిర్మించిన సంపులో ప్రమాదవశాత్తు పడిపోయింది. కుటుంబ సభ్యులు గమనించి బయటికి తీయగా, అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు.

కుటుంబ కలహాలతో వ్యక్తి బలవన్మరణం

నాగర్‌కర్నూల్‌ క్రైం: కుటుంబ కలహాలతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధిలోని శ్రీపురంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీపురానికి చెందిన మెరుగు బాలపీరు(45) కుటుంబంలో కొంత కాలంగా కుటుంబ కలహాలు చోటుచేసుకున్నాయి. మనస్తాపానికి గురైన బాలపీరు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్‌ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. సంఘటనకు సంబంధించి మృతుడి అక్క తిరుపతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలియజేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

యువకుడి ఆత్మహత్య

బిజినేపల్లి: పురుగుల మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాలు.. తిమ్మాజీపేట మండలం మరికల్‌ గ్రామానికి చెందిన శ్రీకాంత్‌(22)ను తల్లి మందలించడంతో మనస్తాపం చెందాడు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి పురుగుల మందు తాగి ఇంట్లోనే పడుకున్నాడు. వాసన రావడంతో గమనించిన తల్లి చుట్టుపక్కల వారితో కలిసి ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ మంగళవారం ఉదయం మరణించాడు. ఈ సంఘటనపై తల్లి బుడ్డమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని హెడ్‌కానిస్టేబుల్‌ ఖాదర్‌ మైనుద్దీన్‌ తెలిపారు.

మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్‌

మల్దకల్‌: ఓ వివాహిత మహిళను తరచూ వేధింపులకు గురి చేస్తున్న మోష అనే వ్యక్తిని మంగళవారం అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ శేఖర్‌ తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితను తరచూ వేధిస్తుండటంతో మహిళ తన కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేసింది. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మహిళ ఫిర్యాదు ఆధారంగా వేధింపులకు పాల్పడుతున్న మోషను అరెస్టు చేసి, గద్వాల కోర్టులో హాజరు పరచగా.. రిమాండ్‌కు తరలించినట్లు తెలియజేశారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ఖిల్లాఘనపురం: చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ శ్రీహరి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన మల్లగల్ల కుర్మయ్య(50) మద్యానికి బానిసయ్యాడు. కుర్మయ్య ఈనెల 25న మద్యం సేవించి ఇంట్లో పడుకున్నాడు. పశువులను మేపేందుకు వెళ్లాలని భార్య కురమమ్మ కోరగా, నీవే వెళ్లమని చెప్పాడు. చేసేది లేక కర్మమ్మ పశువులను మేతకు తీసుకెళ్లింది. మధ్యాహ్నం సమయంలో మద్యం మత్తులో కుర్మయ్య పశువుల కొట్టం వద్ద ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. విషయం తెలుసుకున్న భార్య ఇంటికి వచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 27న రాత్రి మృతిచెందాడు. ఈ విషయమై మృతుడి భార్య కుర్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీహరి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement