
మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని.. నియంతలుగా వ్యవహరించిన వారు కాలగర్భంలో కలిసిపోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ప్రస్తుతం చీకటి రాజ్యం నడుస్తోందని.. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరగని రీతిలో దౌర్భాగ్య పాలన కొనసాగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పక్కదారి పట్టిస్తూ కార్పొరేట్లకు కొమ్ము కాస్తోందని ఆరోపించారు. వివిధ రాష్ట్రాల్లోని బీజేపేతర ప్రభుత్వాలను కూలదోసే పనిలో ఉందని.. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని పేర్కొన్నారు. మాట వినని ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందులకు గురిచేసేందుకు ఈడీ, సీబీఐని వాడుతున్నారని ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకలను అణిచివేసేందుకు కేసులు నమోదు చేయించి వేధిస్తున్నారన్నారు. ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ, రైల్వే, స్టీల్, బీఎస్‌ఎన్‌ఎల్, సింగరేణి వంటి ప్రభుత్వ సంస్థలను అమ్మే హక్కు మోదీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఉంటే మాతో ఉండు.. లేదంటే జైలులో ఉండు అనే నినాదంతో బీజేపీ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. పేదల సొమ్మును అదానికి ధారాధత్తం చేసి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. జేపీసీ (జాయింట్ పార్లమెంటరీ కమిటీ) వేయడానికి భయమెందుకని.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకివ్వరని ప్రశ్నించారు. ప్రజల పక్షాన నిలబడి సమస్యలపై పోరాటంచేస్తామని తెలిపారు. ప్రశ్నపత్రాల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు పరమేశ్‌గౌడ్, బాలనర్సింహ, కొండన్న, బాలకిషన్, సురేష్ పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
కూనంనేని సాంబశివరావు