వీరన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు | - | Sakshi
Sakshi News home page

వీరన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు

Nov 17 2026 1:20 AM | Updated on Nov 17 2026 1:20 AM

కురవి: కార్తీక సోమవారం సందర్భంగా మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వీరభద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదేశంలో మహిళలు దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు.

విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయాలి

మహబూబాబాద్‌ అర్బన్‌: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి వ్యాసరచన, క్విజ్‌ పోటీలు ఎంతగానో ఉపయోగపడుతాయని జిల్లా సైన్స్‌ అధికారి అప్పారావు అన్నారు. జిల్లా గ్రంథాలయంలో సోమవారం జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పారావు హాజరై మాట్లాడుతూ.. కులం, మతం, ఆర్థిక అంతరాలు లేని ఆధునిక దేవాలయాలు గ్రంథాలయాలు అన్నారు. ఆర్థికస్థోమత లేక కోచింగ్‌ సెంటర్లకు వెళ్లలేని విద్యార్థులు, యువతకు ప్రభుత్వ గ్రంథాలయాలు చాలా ఉపయోగపడుతాయన్నారు. పుస్తక పఠనంతో విజ్ఞానం సంపాదించుకోవాలని, ప్రతీరోజు న్యూస్‌ పేపర్‌, వివిధ చరిత్ర పుస్తకాలను చదవాలని సూచించారు. కార్యక్రమంలో లైబ్రేరియన్‌ విజేందర్‌, ఉపాధ్యాయులు సునీత, నారాయణ, సిబ్బంది భూలక్ష్మి, యాదమ్మ, గ్రంథాలయ పాఠకులు వినోద ప్రవీణ్‌, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

19న ఆయుష్‌

ఉద్యోగాలకు పరీక్ష

నెహ్రూసెంటర్‌: జాతీయ ఆయుష్‌ మిషన్‌ పథకం కింద అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో మూడు మల్టీపర్పస్‌ వర్కర్‌ ఖాళీలకు ఈ నెల 19న జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్‌ కళాశాలలో పరీక్ష నిర్వహిస్తామని జిల్లా ఆయుష్‌ నోడల్‌ అధికారి కిరణ్‌కుమార్‌ సోమవారం తెలిపారు. ఉదయం 11నుంచి 12.30గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని, అభ్యర్థులు గంట ముందు హాజరుకావాలన్నారు. ఆధార్‌కార్డు వెంట తీసుకురావాలని, ద్విచక్ర వాహనం లైసె న్స్‌ లేనివారు సైకిల్‌ తొక్కి చూపించాలన్నారు.

దశలవారీగా సబ్‌స్టేషన్ల ఆధునికీకరణ

నెహ్రూసెంటర్‌: మహబూబాబాద్‌ సర్కిల్‌ పరిధిలో 25 ఏళ్లకుపైగా సేవలందిస్తున్న 33/11 కేవీ సబ్‌ స్టేషన్లను దశలవారీగా ఆధునికీకరించి వాటి సామర్థ్యాన్ని పెంచేందుకు టీజీ ఎన్పీడీసీఎల్‌ ప్రత్యేక చర్యలు చేపడుతుందని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ దర్శన్‌కుమార్‌ సోమవారం తెలిపారు. పాత సబ్‌స్టేషన్‌లో కాలక్రమేణా ఆగిపోయిన, తుప్పుపట్టిన, అరిగిపోయిన పరికరాలను గుర్తించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సబ్‌ స్టేషన్లను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 34 సబ్‌స్టేషన్లను ఆధునికీకరించామని, మరో 38పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. సబ్‌స్టేషన్‌లోని పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ వాటి నిర్వహణకు ప్రత్యే క ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. విద్యుత్‌ పరికరాల్లో తలెత్తే లోపాలను ముందస్తుగానే గుర్తించడం ద్వారా సాంకేతిక సమస్యలు, విద్యు త్‌ అంతరాయలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వేసవికాలం, వ్యవసాయ సీజన్‌లో విద్యుత్‌ వినియోగం అధికంగా ఉండే సమయాల్లో డిమాండ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ పనులు ఎంతగానో దోహదం చేస్తాయని వెల్లడించారు.

ప్రాణం మీదికి తెచ్చిన నిరీక్షణ

దంతాలపల్లి: పింఛన్‌ మంజూరు పత్రం కోసం నిరీక్షించిన ఓ మహిళ ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రి పాలైన సంఘటన మండలంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన గడ్డి లక్ష్మి సోమవారం స్థానిక బాలాజీ ఫంక్షన్‌హాల్‌లో జరినగి పింఛన్‌ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి హాజరైంది. కాగా, ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికారుల కోసం నిరీక్షిస్తున్న లక్ష్మి ఛాతిలో నొప్పి రావడంతో ఒక్కసారిగా కిందపడిపోయింది. అక్కడే ఉన్న వైద్య సిబ్బంది గమనించి ఆమెకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం 108 వాహనంలో ఆమెను మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. లక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement