చెత్తకు చోటేది..? | - | Sakshi
Sakshi News home page

చెత్తకు చోటేది..?

Nov 17 2026 1:20 AM | Updated on Nov 17 2026 1:20 AM

డోర్నకల్‌: డోర్నకల్‌ మున్సిపాలిటీలో డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతీరోజు 15 వార్డుల నుంచి ఉదయం, సాయంత్రం కలిపి రెండు టన్నులకు పైగా చెత్తను సేకరిస్తున్నారు. రెండు ట్రాక్టర్లు, మూడు ఆటోల ద్వారా ప్రతీరోజు సేకరించిన చెత్తను గొల్లచర్ల రోడ్డు పక్కన బందంకుంట వద్ద పడేస్తున్నారు. నాలుగేళ్లుగా చెత్తను ఇక్కడ వేస్తుండడంతో బందంకుంట పరిసరాలు చెత్తతో నిండిపోయాయి. అలాగే చెత్తతో కుంట పూడుకుపోతోంది. కుంటలో చెత్త వేస్తుండడంపై మత్స్యకారులు, ఈ ప్రాంత రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ మార్గంలో నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తుండడంతో దుర్గంధంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఎకరం స్థలం అవసరం..

మున్సిపాలిటీలో డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేయడానికి కనీసం ఎకరం స్థలం అవసరం. డంపింగ్‌ యార్డులో తడిచెత్త, పొడిచెత్తను వేరు చేసేందుకు డీఆర్‌సీసీ సెంటర్‌తో పాటు తడిచెత్తను ఎరువుగా మార్చేందుకు కంపోస్ట్‌ షెడ్డు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కన్వేయర్‌ బెల్ట్‌, గార్డెన్‌ షర్టర్‌తో పాటు ఇతర పరికరాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పూర్తిస్థాయి డంపింగ్‌ యార్డు ఏర్పాటుకు రూ.2కోట్ల వరకు నిధులు అవసరం. సుమారు రెండు నెలల క్రితం రూ.25 లక్షల వ్యయంతో డంపింగ్‌ యార్డులో వినియోగించే కన్వేయర్‌ బెల్ట్‌తో పాటు గార్డెన్‌ షర్టర్‌లను కొనుగోలు చేసి మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో ఉంచారు.

స్థలం కొరత..

డోర్నకల్‌ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ స్థలం లేకపోవడంతో డంపింగ్‌ యార్డు ఏర్పాటుకు మోక్షం లభించడం లేదు. గతంలో అమ్మపాలెం సమీపంలో ప్రభుత్వ స్థలం గుర్తించి డంపింగ్‌ యార్డు ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. అయితే అమ్మపాలెం గ్రామస్తులు తమ గ్రామ పరిధిలో చెత్త వేయవద్దని అభ్యంతరం తెలపడంతో పనులు నిలిచాయి. డంపింగ్‌ యార్డు స్థలం కోసం తాము తహసీల్దార్‌ను పలుమార్లు సంప్రదించినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ నాగరాజు తెలిపారు. గత, ప్రస్తుత మున్సిపాలిటీ పాలకవర్గాలు డంపింగ్‌ యార్డు సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, పాలకవర్గం స్పందించి స్థలాన్ని గుర్తించి డంపింగ్‌ యార్డు ఏర్పాటు పనులు ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.

డోర్నకల్‌లో డంపింగ్‌ యార్డుకు

స్థలం కొరత

చెత్తతో పూడుకుపోతున్న బందంకుంట

వాహనదారులు, ప్రయాణికుల

ఇబ్బందులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement