● ప్రభుత్వ విప్ జాటోతు రాంచంద్రునాయక్
● 280 డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాల పంపిణీ
తొర్రూరు: ప్రజా ప్రభుత్వం ఇళ్లు నిర్మించి పేదలకు నీడ కల్పిస్తుంటే బీఆర్‌ఎస్‌కు కడుపు మండుతుందని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్ విమర్శించారు. పట్టణంలోని దుబ్బతండా సమీపంలో నిర్మించిన 280 డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులకు సోమవారం పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, కలెక్టర్ స్నేహ శబరీష్‌తో కలిసి ప్రభుత్వ విప్ పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పదేళ్లలో 2లక్షలు ఇళ్లు నిర్మిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే విడతలో 4.50 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు అందించిందన్నారు. రెండో విడతలో మరో 5 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు అందిస్తామన్నారు. రూ.2వేల కోట్లతో పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తెలిపారు. తాజాగా టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ.10 కోట్లు మంజూరయ్యాయన్నారు. తొర్రూరులో మినీ ట్యాంక్‌బండ్, 100 పడకల ఆస్పత్రి, వాటర్ ట్యాంకులు, డివైడర్, రహదారులు అందుబాటులోకి తెస్తామన్నారు. వచ్చే నెలలో నియోజకవర్గంలో సీఎం రేవంత్‌రెడ్డితో సభ నిర్వహిస్తామన్నారు. కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. రూ.17 కోట్ల వ్యయంతో తొర్రూరులో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం జరిగిందన్నారు. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టామన్నారు. అనంతరం 280 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు 4 ఎకరాల భూమి విరాళంగా అందించిన రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ భూక్య బాబును ఎమ్మెల్యే, కలెక్టర్ సత్కరించారు. సమావేశంలో హౌజింగ్ పీడీ పురుషోత్తం, మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్‌కుమార్, వైస్ చైర్మన్ సోమ రజిని, ఆర్డీఓ గణేష్, కౌన్సిలర్లు చాపల బాపురెడ్డి, ముద్దసాని సురేష్, పెదగాని కళావతి, బసనబోయిన ఐలమ్మ, భద్రునాయక్, మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


