కేసముద్రం: ఆదృశ్యమైన ఓ ఆరేళ్ల బాలుడి ఆచూకీని పోలీసులు వాట్సాప్ ద్వారా గుర్తించారు. 12 గంటల్లోనే తప్పిపోయిన ఆ చిన్నారి ఆచూకీని గుర్తించి కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. ఈ ఘటన సోమవారం కేసముద్రంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన కడారి ఇందల్ తన కుటుంబంతో కలిసి బతుకుదెరువు నిమిత్తం కేసముద్రం వచ్చా డు. పట్టణంలో ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 14న సాయంత్రం తన ఆరేళ్ల కుమారుడు రాయ్‌సింగ్ తోటిపిల్లలతో ఆడుకుంటు ండగా మందలించాడు. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాయ్‌సింగ్ అదృశ్యమయ్యాడు. తప్పిపోయిన కుమారుడి కోసం తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించగా ఆచూకీ లభించలేదు. బాలుడి తండ్రి ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడి ఫొటో, వివరాలను వాట్సాప్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడంతోపాటు, మూడు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు వాట్సాప్ ద్వారా అందిన సమాచారం ఆధారంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బాలుడు తిరుగుతున్నట్లు ఓ వ్యక్తి ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. కేసముద్రంలో రైలు ఎక్కి అదృశ్యమైన రాయ్‌సింగ్ ఆచూకీని 12 గంటల వ్యవధిలోనే గుర్తించినట్లు ఎస్సై క్రాంతికిరణ్ తెలిపారు. కాగా, ఆ బాలుడిని మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు, కేసముద్రం ఎస్సై క్రాంతికిరణ్ క్షేమంగా కుటుంబీకులకు అప్పగించారు. దీంతో ఊపిరిపీల్చుకున్న కుటుంబ సభ్యులు.. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
చిన్నారిని క్షేమంగా కుటుంబీకులకు అప్పగించిన పోలీసులు


