గార్ల: జిల్లాలోని గార్ల పెద్దచెరువు ఆయకట్టు పంట కాల్వలు ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోవడం లేదు. దీంతో ఏటా ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో పెద్దచెరువు నేటికీ నిండలేదు. దీంతో పంటలు సాగు చేయకపోవడంతో సాగుభూములు బీడుగా మారాయి. ఇదిలా ఉండగా చెరువు కాల్వల్లో పూడిక పేరుకుపోవడంతో పాటు, పిచ్చిమొక్కలు, తూటికాడలు ఏపుగా పెరగడంతో కొన్నిచోట్ల కాల్వలు ఆనవాళ్లు కోల్పోయాయి. కాగా, ఎల్‌నినో ప్రభావంతో ప్రస్తుత యాసంగిలోనూ పంటలు సాగు చేసే వీలు లేదని, ఇప్పుడు కాల్వలు మరమ్మతులు చేస్తే వచ్చే వానాకాలంలో ఉపయోగపడుతాయని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
2,000 ఎకరాల ఆయకట్టు..
పెద్దచెరువు కింద సుమారు 2,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు కింద మైస్ తూము, చింతముత్తిగాని, సంగళ్లు, సున్నం తూములు ఉన్నాయి. ఈ తూముల పంట కాల్వల ద్వారా భూములకు నీటి సరఫరా అవుతుంది. అయితే 20 ఏళ్ల నుంచి ఇరిగేషన్ అధికారులు ఈ తూముల పంట కాల్వ లకు మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రతీ ఏటా ఆయకట్టు చివరి వరకు సాగునీరు అందక చేతి కొచ్చే సమయంలో పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
రైతులే పూడికతీత..
ప్రతీ ఏటా రైతులు ఎకరాకు కొంత మొత్తంలో డబ్బులు జమ చేసుకొని నామమాత్రంగా పంట కాల్వల పూడికతీత, చెత్తాచెదారం, పిచ్చిమొక్కలను తొలగించుకొని పంటలు పండించుకుంటున్నారు. గతంలో ఉపాధి కూలీల ద్వారా పంట కా ల్వల్లో పూడికతీత పనులు చేపట్టేవారని, రెండేళ్ల నుంచి ఈజీఎస్ అధికారులు కూలీల ద్వారా పంట కాల్వల పూడికతీత పనులు చేయించకుండా, చెరువుల్లో ఫిష్‌పాండ్ గుంతలు తీయిస్తూ, తమకు ఉపయోగపడని పనులు చేయిస్తున్నారని మండల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఇరిగేషన్ అధికారులు స్పందించి కాల్వల్లో పూడికతీత, పిచ్చిమొక్కలను తొలగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
మరమ్మతులు చేపట్టాలి..
గార్ల పెద్దచెరువు కింద పంట కా ల్వల్లో పూడికతీత పనులు చేపట్టి ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందేలా కృషి చేయాలి. లేకపోతే ప్రతీ ఏటా ఆయకట్టు చివరి భూములకు సక్రమంగా సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. ఇరిగేషన్ అధికారులు పంట కాల్వలకు మరమ్మతులు చేపట్టి వానాకాలం పంటలకై నా సాగునీరు అందించాలి.
–ముంగి రాములు, రైతు
ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని గార్ల పెద్దచెరువు పంట కాల్వలు
పేరుకుపోయిన పూడిక..
అల్లుకుపోయిన పిచ్చిమొక్కలు
ఏటా చెరువు ఆయకట్టు చివరి పంటలకు అందని సాగునీరు
కాల్వలు శుభ్రం చేస్తే వానాకాలంలో సాఫీగా సాగునీరు


