కాళోజీ సోదరులను స్ఫూర్తిగా తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కాళోజీ సోదరులను స్ఫూర్తిగా తీసుకోవాలి

Nov 14 2026 1:23 AM | Updated on Nov 14 2026 1:23 AM

విద్యారణ్యపురి: జీవిత కాలం ఆదర్శవంతమైన జీవితాన్ని గడపడమే కాకుండా.. సమాజ హితం కోసం కృషి చేసిన కాళోజీ సోదరుల స్ఫూర్తిని నేటితరం కవులు, రచయితలు అందిపుచ్చుకోవాలని కేంద్ర సాహిత్యఅకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్‌ అంపశయ్యనవీన్‌ అన్నారు. కాళోజీ నారాయణరావు వర్ధంతి, కాళోజీ సోదరుల యాది సభ సందర్భంగా కాళోజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం హనుమకొండలోని కాళోజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వడ్డెపల్లిలోని పీఆర్‌రెడ్డి భవన్‌లో కాళోజీ ఫౌండేషన్‌ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి అధ్యక్షతన నిర్వహించిన కాళోజీ సోదరుల యాదిసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వరంగల్‌లో సాహిత్య వాతావారణాన్ని కల్పించి కవులు, రచయితలను ప్రోత్సహించి ఒక నూతన సమాజ నిర్మాణానికి పాటుపడినవారు కాళోజీ సోదరులు అని ఆయన కొనియాడారు. ప్రముఖ కవయిత్రి నెల్లుట్ల రమాదేవి మాట్లాడుతూ.. ప్రజాకవి కాళోజీ నారాయణ రావు తన చివరిశ్వాస వరకు తెలంగాణా ప్రజల వ్యవహారిక భాష, యాసలో కవిత్వం రాశారని, తెలంగాణా సమాజాన్ని చైతన్యవంతం చేసిన గొప్పకవి కాళోజీ అని కొనియాడారు. అన్యాయాన్ని ఎదిరించినవాడే నాకు ఆరాధ్యుడంటూ వెళ్లిపోయిన కాళోజీ వ్యక్తిత్వం జీవితం భవిష్యత్‌ తరాలకు కూడా స్ఫూర్తిదాయకమని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రముఖ కవి వీఆర్‌ విద్యార్థి కాళోజీ ఫౌండేషన్‌ నివేదికను సమర్పించారు. ప్రముఖసాహితీవేత్త గండా రామిరెడ్డి కాళోజీ రామేశ్వర్‌రావు షాద్‌ గురించి ప్రసంగించారు.

పురస్కారాల ప్రదానం

ప్రముఖకవులు పొట్లపెల్లి శ్రీనివాస్‌రావు, పందిళ్ల అశోక్‌కుమార్‌ నిర్వహణలో కాళోజీ రామేశ్వర్‌రావు షాద్‌ పురస్కారాన్ని ప్రముఖ కవయిత్రి ఎలిజబెత్‌ కురియన్‌మోనాకు, ప్రజాకవి కాళోజీ పురస్కారాన్ని ప్రముఖకవి ఉదారి నారాయణకు అందజేశారు. కార్యక్రమంలో ప్రముఖ కవి డాక్టర్‌ ఎన్‌వీఎన్‌చారి, మానవహక్కుల నేత జీవన్‌ కుమార్‌, సాహితీవేత్తలు పిచంద్‌, బిల్లా మహేందర్‌, డాక్టర్‌ బన్న అయిలయ్యి, డాక్టర్‌ కృష్ణారావు, డాక్టర్‌ కర్రెసదాశివ్‌, డాక్టర్‌ ఆగపాటి రాజకుమార్‌, డాక్టర్‌ బానోత్‌ స్వామి, కుందావజ్జుల కృష్ణమూర్తి పాల్గొన్నారు.

కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement