కున్నాయిగూడెం : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని సమ్మక్క సాగర్ బ్యారేజీ నీటితో నిండు కుండలా కనిపిస్తోంది. బ్యారేజీలో 59 గేట్లు ఉండగా అందులో ఒకటి మాత్రమే ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మిగతా 58 గేట్లను మూసి నీటిని నిల్వ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బ్యారేజీ నిండుకుండలా కనిపిస్తోంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 77.20 మీటర్ల నీటిమట్టం కొనసాగుతోంది. కాగా, దేవాదుల వద్ద ఉన్న ఎత్తిపోతల వద్ద 10 మోటార్లు ఉండగా ఎనిమిదింటితో 2,129 క్యూసెక్కుల నీటిని దిగువలో ఉన్న భీం ఘనపురం రిజర్వాయర్‌లోకి ఎత్తి పోస్తున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలుపుతున్నారు. ఎత్తిపోతల వద్ద ప్రస్తుతం 76.8 మీటర్ల నీటి మట్టం కొనసాగుతోంది.
కాజీపేట మీదుగా శబరిమల ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : శబరిమల పుణ్యక్షేత్రం వెళ్లే అయ్యప్ప మాలధారుల సౌకర్యార్థం కాజీపేట జంక్షన్, వరంగల్ మీదుగా చర్లపల్లి–కొల్లం–చర్లపల్లి మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ గురువారం తెలిపారు.
ప్రత్యేక రైళ్ల వివరాలు..
డిసెంబర్ 30వ తేదీ, 2027 జనవరి 6, 13వ తేదీల్లో (బుధవారం) బయలుదేరే చర్లపల్లి–కొల్లం (07199) శబరిమల ఎక్స్‌ప్రెస్ కాజీపేటకు చేరుకుని వెళ్తుంది. అదేవిధంగా 2027, జనవరి 1,8,15వ తేదీల్లో (శుక్రవారం) బయలుదేరే కొల్లం–చర్లపల్లి (07200) శబరిమల ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు కాజీపేటకు చేరుకుని వెళ్తుంది. వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి శబరిమలకు వెళ్లే అయ్యప్ప మాలధారులకు ఈ ప్రత్యేక రైళ్లు ఎంతో ఉపయోగపడుతాయి. కాజీపేట సబ్ డివిజన్ పరిధిలో భువనగిరి, జనగామ, కాజీపేట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడలో హాల్టింగ్ కల్పించారు.
కాజీపేట మీదుగా వన్‌వే స్పెషల్ ట్రైన్..
కాజీపేట జంక్షన్ మీదుగా బరౌని–ఎస్‌ఎంవీటీ బెంగళూరు మధ్య వన్‌వే స్పెషల్ ట్రైన్ నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు.
ట్రైన్ వివరాలు..
నవంబర్ 20వ తేదీన బరౌనిలో బయలుదేరే బరౌని–ఎస్‌ఎంవీటీ బెంగళూరు (05250) ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు కాజీపేటకు చేరుకుని వెళ్తుంది.
విద్యుత్ ఉచ్చులు తాకి
అడవి పంది మృత్యువాత
ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం పాలవాగు సమీపంలో గురువారం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చులు తగిలి అడవి పంది మృత్యువాత పడింది. పొలంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి అడవిలోకి సుమారు 5 కిలోమీటర్ల మేర విద్యుత్ ఉచ్చులు అమర్చినట్లు తెలుస్తోంది. గతంలో ఇలాంటి ఉచ్చులకు తగిలి పలువురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి విద్యుత్ ఉచ్చులు అమర్చే వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అటవీ శాఖ రేంజ్ అధికారి భాస్కర్, ఎఫ్‌బీఓ దయానంద్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.


