మహబూబాబాద్ రూరల్: అప్పుల బాధతో పురుగుల మందుతాగి రైతు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. మహబూబాబాద్ రూరల్ ఎస్సై పి.రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ మండలం ఇస్లావత్ తండా (ఎస్) గ్రామ పరిధిలోని వెంకట్రాంతండాకు చెందిన రైతు బానోత్ రాములు (58)కు రెండు ఎకరాల పైచిలుకు వ్యవసాయ భూమి ఉంది. అందులో మొక్కజొన్న, వరి పంటలు సాగు చేస్తున్నాడు. పంటల సాగు, కుటుంబ అవసరాల నిమిత్తం రాములు రూ.3 లక్షల వరకు అప్పులు తీసుకున్నాడు. ఆ అప్పులు తీర్చలేకపోవడంతో మనస్తాపానికి గురైన ఆయన ఈనెల 10వ తేదీ సాయంత్రం ఇంటివద్ద గడ్డి మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిగా చికిత్స పొందుతూ గురువా రం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి కు మారుడు భిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
ఆగపేటలో మహిళా రైతు..
నర్మెట : అప్పుల బాధతో ఓ మహిళా రైతు గడ్డి మందు తాగి బలవన్మ రణానికి పాల్పడింది. ఈ ఘటన గురువారం జనగామ జిల్లా నర్మెట మండలం ఆగపేటలో చోటు చేసుకుంది. ఎస్సై చాగర్ల రఘుపతి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మెట్ల ఉప్పలమ్మ (50) తన భర్త 30 ఏళ్ల క్రితం మృతి చెందగా వ్యవసాయం చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో సాగు చేసిన పంటలు ఆశాజనకంగా లేకపోవడంతోపాటు అప్పుల భారం పెరిగిపోవడంతో మనస్తాపానికి గురై బుధవారం ఇంట్లో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు జనగామ ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి కుమారుడు నవీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


