● ఎస్పీ డాక్టర్ శబరీష్
మహబూబాబాద్ రూరల్ : గంజాయి, నల్లబెల్లం, గుడుంబా అక్రమ రవాణా, విక్రయాలపై నిఘా పెంచి కఠిన చర్యలు చేపట్టాలని ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశించారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సమావేశ మందిరంలో బుధవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ జిల్లాలోని కేసులపై సమీక్షించి మాట్లాడారు. గుడుంబా తయారీ కేంద్రాలపై నిరంతరం దాడులు నిర్వహించి, బాధ్యులపై కేసులు నమోదు చేయాలని, నల్లబెల్లం, గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై నిఘా పెంచి మరిన్ని కేసులు నమోదు చేయాలన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించి, నిందితుల అరెస్టులు పూర్తి చేయాలని, నూతన చట్టాల అమలుపై పూర్తి అవగాహనతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. సీసీటీఎన్‌ఎస్‌లో కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని, డిజిటల్ సాక్ష్యాల సేకరణలో సమర్థత పెంచి, పనితీరు నివేదికలను మెరుగుపరచాలన్నారు. అత్యవసర ఫిర్యాదులపై తక్షణ స్పందన అందించి, రెస్పాన్స్ టైంను మెరుగుపరచాలని, జిల్లాలోని అన్ని ముఖ్యమైన కూడళ్లు, ప్రధాన రహదారులు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే ఉన్న కెమెరాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, సక్రమంగా పనిచేసేలా నిర్వహణ, మరమ్మతులు చేపట్టాలన్నారు. పోలీసు స్టేషన్లకు వచ్చే ప్రజా ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతాయుతంగా స్వీకరించి, ప్రతి ఫిర్యాదుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీలు తిరుపతిరావు, కృష్ణకిషోర్, సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


