● ముగిసిన రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ అథ్లెటిక్స్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్ : హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో రెండు రోజులపాటు నిర్వహించిన 70వ తెలంగాణ రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ అండర్–14 బాలబాలికల అథ్లెటిక్స్ పోటీలు బుధవారం ముగిశాయి. ఈ పోటీల్లో 50 పాయింట్లతో రంగారెడ్డి జిల్లా ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. బాలుర విభాగంలో 29 పాయింట్లతో ఆదిలాబాద్ జిల్లా ప్రథమ, 19 పాయింట్లతో రంగారెడ్డి జిల్లా ద్వితీయ స్థానాలు సాధించాయి. బాలికల విభాగంలో 31 పాయింట్లతో రంగారెడ్డి జిల్లా ప్రథమ, 24 పాయింట్లతో ఖమ్మం జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ విజేతలకు బహుమతులు, ప్రశంస పత్రాలు అందజేశారు. తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె. సారంగపాణి, ఖేలో ఇండియా అథ్లెటిక్స్ కోచ్ మహమ్మద్ గౌస్ తదితరులు పాల్గొని క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో పీఈటీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ. ప్రభాకర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ వి. వాసుదేవరావు, పలువురు ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు.


