జనగామ రూరల్ : జనగామ జిల్లా క్రీడా రంగం మరో ప్రతిష్టాత్మక ఘట్టానికి వేదిక కానుంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు సంబంధించిన రాష్ట్రస్థాయి సెపక్ తక్రా క్రీడా పోటీలు, ఎంపికలు గురువారం నుంచి ఈ నెల 14వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి 10 జిల్లాల నుంచి సుమారు 100 మంది క్రీడాకారులు, 40 మంది కోచ్‌లు, మేనేజర్లు, 15 మంది టెక్నికల్ అధికారులతో పాటు స్థానిక పీఈటీలు, పీడీలు పాల్గొననున్నారు.
పకడ్బందీ ఏర్పాట్లు..
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు విజయవంతంగా నిర్వహించేందుకు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. భద్రత, వైద్య సేవలు, తాగునీరు, పారిశుద్ధ్యం, వసతి, రవాణా, క్రీడా ప్రాంగణానికి సంబంధించిన అన్ని సదుపాయాలు సిద్ధం చేశారు.
బాలబాలికలకు ప్రత్యేక వసతి..
పోటీల్లో పాల్గొనే బాలికలు, వారితో పాటు వచ్చే మహిళా ఎస్కార్ట్ ఉపాధ్యాయుల కోసం ఎంజేపీపెంబర్తి పాఠశాలలో ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అదే విధంగా బాలురకు వారితో పాటు వచ్చే పురుష ఎస్కార్ట్ ఉపాధ్యాయుల కోసం స్థానిక మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో వసతి సౌకర్యాలు కల్పించారు.
నేటినుంచి 14వ తేదీ వరకు
సెపక్ తక్రా పోటీలు
ధర్మకంచ మినీ స్టేడియంలో నిర్వహణ
హాజరుకానున్న 100 మంది
క్రీడాకారులు, 40 మంది కోచ్‌లు


