సాక్షి ప్రతినిధి, వరంగల్: కాజీపేట, వరంగల్ మీదుగా రాకపోకలు సాగించే నర్సాపూర్–నాగర్‌సోల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు హోదా మారనుంది. ఇప్పటివరకు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా ప్రయాణికులకు సేవలందిస్తున్న ఈ రైలును సాధారణ మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైలుగా మారుస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైలు నంబర్లను సైతం మార్చింది. 2027 జనవరి 3 నుంచి కొత్త నంబర్లు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పుతో కాజీపేట, వరంగల్ మీదుగా ప్రయాణించే రైలు ప్రయాణికులు కొత్త నంబర్లను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.
12787/88 స్థానంలో 17241/42..
ప్రస్తుతం నర్సాపూర్ నుంచి నాగర్‌సోల్‌కు వెళ్లే రైలు 12787 నంబరుతో, నాగర్‌సోల్ నుంచి నర్సాపూర్‌కు వచ్చే రైలు 12788 నంబరుతో నడుస్తోంది. సూపర్‌ఫాస్ట్ కేటగిరీ నుంచి మెయిల్/ఎక్స్‌ప్రెస్ కేటగిరీలోకి మారుస్తున్న నేపథ్యంలో ఈ రెండు రైళ్ల నంబర్లను కూడా రైల్వేశాఖ సవరించింది. ఇకపై నర్సాపూర్–నాగర్‌సోల్ రైలు 17241 నంబరుతో, నాగర్‌సోల్–నర్సాపూర్ రైలు 17242 నంబరుతో నడవనుంది. జనవరి 3, 2027 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.
రెండు రోజులు మినహా..
ఈ రైలు వారంలో రెండు రోజులు మినహా మిగిలిన రోజుల్లో రాకపోకలు సాగిస్తోంది. నర్సాపూర్ నుంచి బయలుదేరి నాగర్‌సోల్‌కు వెళ్లే మార్గంలో ఉమ్మడి వరంగల్ ప్రాంతంలోని ప్రయాణికులకు కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్లు కీలకంగా ఉన్నాయి. అలాగే, మహారాష్ట్ర వైపు వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు ఉపయోగకరంగా ఉంటోంది. హోదా మార్పుతోపాటు నంబర్ల మార్పు జరగనుండడంతో ప్రయాణికులు ముందుగానే ఈ విషయాన్ని గమనించాల్సి ఉంది.
టికెట్ బుకింగ్‌లోనూ మార్పు..
రైలు నంబర్ల ఆధారంగా టికెట్లు బుక్ చేసుకునే ప్ర యాణికులు జనవరి 3 నుంచి పాత నంబర్లకు బదులు కొత్తవి ఉపయోగించాలి. రైల్వే టికెట్ రిజర్వేషన్ కేంద్రాలు, ఆన్‌లైన్ బుకింగ్ సమయంలోనూ ఈ మార్పును పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రైలు రాకపోకల సమయాలు, స్టాపేజీలు, ఇతర ప్రయాణ వివరాల్లో మార్పులు ఉన్నాయా లేదా అనే అంశం అధికారిక రైల్వే టైంటేబుల్ ద్వారా పరిశీలించుకోవడం అవసరం.
సాధారణ ఎక్స్‌ప్రెస్‌గా
నర్సాపూర్–నాగర్‌సోల్ రైలు
హోదా తగ్గిస్తూ
దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం
జనవరి 3 నుంచి కొత్త నంబర్లతో
రాకపోకలు
12787/88 స్థానంలో 17241/42గా మార్పు
కాజీపేట, వరంగల్ మీదుగా వెళ్లే రైలుకు కొత్త గుర్తింపు
ప్రయాణికులు రైల్వే టైంటేబుల్‌ను
గమనించాలని సూచన


