హన్మకొండ అర్బన్: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ నుంచి జిల్లాల అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రేటర్ వరంగల్ (హనుమకొండ, వరంగల్)లో ప్రభుత్వ స్థలాలను కేటాయించి జీ ప్లస్ 5 విధానంలో 480 చొప్పున మొత్తం 2,400 ఫ్లాట్లతో ఇందిరమ్మ టవర్స్ నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. స్థానిక పరిస్థితులను బట్టి ఒక్కో ఫ్లాట్ నిర్మాణ వ్యయాన్ని రూ.8.50 లక్షలుగా అంచనా వేశామని పేర్కొన్నారు. ఇందులో రూ.5 లక్షలు ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుందని, మిగతా రూ.3.50 లక్షలు లబ్ధిదారులు విడతల వారీగా చెల్లించాలన్నారు. అర్హులు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తుతోపాటు రూ.10 వేల ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ చెల్లించాలన్నారు. లాటరీలో ఫ్లాట్ లభించని వారికి ఈ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని చెప్పారు. లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా లాటరీ పద్ధతిలో నిర్వహిస్తామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 10 శాతం కోటా ఉంటుందని పేర్కొన్నారు. డిసెంబర్ 5లోగా అర్హులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. హనుమకొండ కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ ఎన్.రవి, స్థానిక సంస్థల జిల్లా ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ బి.శేషాద్రి, జిల్లా రెవెన్యూ అధికారి కె.శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సిద్ధార్థనాయక్ పాల్గొన్నారు.
● గ్రేటర్ వరంగల్‌లో పైలట్ ప్రాజెక్టు
● 2,400 ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక
● వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర
గృహనిర్మాణ శాఖ మేనేజింగ్
డైరెక్టర్ వీపీ గౌతమ్


