మహిళా హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

మహిళా హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలి

Nov 11 2026 1:19 AM | Updated on Nov 11 2026 1:19 AM

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీలోని మహిళా హాస్టళ్లలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థినులు మంగళవారం పరిపాలన భవనంలోని కారిడార్‌లో బైఠాయించి ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, నాణ్యమైన భోజనం అందించి ఇతర మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన కొనసాగించారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు వీరికి మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టళ్ల ఆఫీస్‌లో అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. హాస్టళ్లలో ఎన్నిరోజులు తింటే అన్ని రోజులకు మాత్రమే బిల్లులు విధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏబీవీపీ స్టేట్‌ యూనివర్సిటీస్‌ ప్రముఖ్‌ అంబాలకిరణ్‌, బాధ్యులు మేకల జ్ఞానేశ్వర్‌, సాయికుమార్‌, సారిక, మధు, నందు, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

అవకతవకలకు పాల్పడే వారిని ఉపేక్షించం..

హాస్టళ్ల నిర్వహణలో అవకతవకలకు పాల్పడిన వారిని ఉపేక్షించబోమని, హాస్టళ్ల విద్యార్థినుల సమస్యలు పరిష్కరిస్తామని వీసీ కె.ప్రతాప్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆందోళన చేస్తున్న విద్యార్థినులతో సెనెట్‌హాల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు తమ సమస్యలను వీసీ దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థినుల సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం అందుబాటులో ఉందని, నేరుగా వారిని సంప్రదించాలని వీసీ సూచించారు. విద్యార్థినులు హాస్టళ్లలో లేని కాలానికి సంబంధించి కనీస హాస్టల్‌ రుసుమును నిర్ణయించే అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. రిజిస్ట్రార్‌ వి. రామచంద్రం, పాలకమండలి సభ్యుడు బి. సురేశ్‌లాల్‌, హాస్టళ్ల డైరెక్టర్లు పి. శ్రీనివాస్‌, సుమలత, అభివృద్ధి అధికారి వై. వెంకయ్య పాల్గొన్నారు.

విద్యార్థినుల డిమాండ్‌ .. కేయూలో ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement