కాశిబుగ్గ: హోటళ్లలో బిర్యానీ మస్తుగా ఉందని తింటే.. అందులో కృత్రిమ రంగులు, నిల్వ ఉంచిన చికెన్, సగం ఉడికిన చికెన్ ఆహార పదార్థాలు ఉన్నట్లు అధికారులే గుర్తించారు. ఉదయం నుంచి అర్ధరాత్రి దాటే వరకు నడిచే పలు హోటళ్ల బండారం బయటపెట్టారు. పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అఽధికారుల వివరాల ప్రకారం.. వరంగల్ మండి బజార్‌లోని జాఫ్రాన్, ఖుర్షీద్ బిర్యానీ హోటళ్లలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అఽఽధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా హోటళ్ల యాజమానులు ఆహార భద్రతా లైసెన్స్ ప్రదర్శించకుండా, ఆహార పదార్థాలపై ఈగలు, దోమలు వాలకుండా నివారణ చర్యలు చేపట్టలేదని గుర్తించారు. అలాగే, ఆహార పదార్థాల్లో కృత్రిమ రంగులు వాడుతూ, నిల్వ ఉంచిన చికెన్, సగం ఉడికిన చికెన్‌ను కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే, హోటళ్లల్లో బొద్దింకలు, సాలేగూళ్లు ఉన్నాయని, నేల, గోడలు అపరిశుభ్రంగా మారాయని, వంటవారికి ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు, పురుగుల నివారణ, నీటి పరీక్ష నివేదికలు లేవని తనిఖీల్లో గుర్తించినట్లు వారు వివరించారు. ఈ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులకు సూచించారు. ఈ తనిఖీల్లో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ఎ.మధుసూదన్, ఇన్స్పెక్టర్లు జి.సుబ్బారెడ్డి, కె.శ్రీధర్, రాజగోపాల్, బండారి రాజు, ఎస్సైలు బి.ఉప్పలయ్య, కె.సుధాకర్, ఫుడ్ సేఫ్టీ సీనియర్ ఆఫీసర్ కృష్ణమూర్తి, జూనియర్ ఆఫీసర్ మౌనిక పాల్గొన్నారు.
కృత్రిమ రంగులు, నిల్వ ఉంచిన,
సగం ఉడికిన చికెన్ లభ్యం


