పండుగ పూట విషాదం.. | - | Sakshi
Sakshi News home page

పండుగ పూట విషాదం..

Nov 10 2026 1:19 AM | Updated on Nov 10 2026 1:19 AM

బైక్‌ను ఢీకొన్న కారు.. యువకుడి దుర్మరణం

హసన్‌పర్తి : కారు.. బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని భీమారం ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. భీమారానికి చెందిన ఎములపల్లి వెంకట రమణ(26) తండ్రితో కలిసి స్థానిక కిరాణ షాపు నిర్వహిస్తున్నాడు. దీపావళి వేడుకలు కుటుంబీకులతో సంబరంగా నిర్వహించుకున్న అనంతరం బైక్‌పై అల్పాహారం కోసం కేయూసీ జంక్షన్‌ వైపునకు బయలుదేరాడు. ఈ క్రమంలో మార్గమధ్యలోని సాకేత పాఠశాల సమీపంలో పరకాల నుంచి హనుమకొండ వైపునకు వస్తున్న కారు.. బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటరమణ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న కేయూ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం తరలించారు. కాగా, కుటుంబీకుల అనుమతి మేరకు ఎల్‌వీప్రసాద్‌ నేత్ర వైద్య సిబ్బంది వెంకటరమణ కళ్లు సేకరించారు.

దంతాలపల్లిలో వ్యక్తి..

దంతాలపల్లి : మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలకేంద్రంలో కారు.. బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. నెల్లికుదురు మండలం బ్రాహ్మణకొత్తపల్లి గ్రామానికి చెందిన కోల సోమయ్య(50) ఆదివారం బైక్‌పై దంతాలపల్లికి వచ్చాడు. ఇండియన్‌ ఆయిల్‌ బంక్‌లో బైక్‌లో పెట్రోల్‌ పోయించుకుని రోడ్డు ఎక్కుతున్నాడు. ఈ క్రమంలో చిన్నగూడూరు మండలం మంగోళిగూడెం గ్రామానికి చెందిన లూనావత్‌ సుమన్‌ కారులో హైదరాబాద్‌ నుంచి స్వగ్రామం వస్తున్నాడు. ఈ సమయంలో బంక్‌ నుంచి బయటకు వస్తున్న బైక్‌ను ఢీకొన్నాడు. ఈ ఘటనలో సోమయ్య ఎగిరి రోడ్డుపై పడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పండుగ రోజు ఇంటి పెద్దదిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై మృతుడి కుమారుడు యాకన్న ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు యాకన్న, కూతురు సంధ్య ఉన్నారు. కాగా, మృతుడి కుటంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ గ్రామస్తులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పి పంపించారు.

వడ్డెకొత్తపల్లి శివారులో మరో వ్యక్తి..

పెద్దవంగర: గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఎస్సై ప్రమోద్‌కుమార్‌ గౌడ్‌ కథనం ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు పట్టణానికి చెందిన శివరాత్రి నాగవద్దిరాజు (43) హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. దీపావళి సందర్భంగా బైక్‌పై సోమవారం రాత్రి స్వగ్రామం బయలు దేరాడు. రాత్రి 12:30 గంటల సమయంలో తొర్రూరు–తిర్మలగిరి ప్రధాన రహదారిపై వడ్డెకొత్తపల్లి గ్రామ శివారులోని విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వద్ద ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న 108 సిబ్బంది క్షతగాత్రుడిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య శివరాత్రి హైమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చేస్తున్నట్లు ఎస్సై ప్రమోద్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు.

శంభునిపేట నాగమయ్య గుడి కమాన్‌ వద్ద యువకుడు..

ఖిలా వరంగల్‌ : ఓ బైక్‌ రంగ్‌ రూట్‌లో వచ్చి మరో బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా.. మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన వరంగల్‌–ఖమ్మం జాతీయ రహదారిపై శంభునిపేట నాగమయ్య గుడి కమాన్‌ వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా జేగంపేలు ఎక్స్‌ రోడ్‌ రామగిరి మండలానికి చెందిన మేద కనకరాజు కుమారుడు వంశీ కృష్ణ (24) జెప్టో ఆన్‌లైన్‌ డెలివరీ (నిత్యావసర సరుకులు) కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవల వరంగల్‌ బదిలీకాగా.. రంగశాయిపేట నాగమయ్య గుడి సమీపంలో అద్దెకు ఉంటున్నాడు. ఆదివారం రాత్రి 11: 30 గంటల సమయంలో స్నేహితుడు బొంత సునీల్‌ బైక్‌పై ఇద్దరు కలిసి జెప్టో కంపెనీ స్టోర్‌ వైపునకు వెళ్తున్నారు. ఈక్రమంలో నాగమయ్య గుడి కమాన్‌ ఎదురుగా వరంగల్‌–ఖమ్మం జాతీయ రహదారిపై గుర్తుతెలియని వ్యక్తి రంగ్‌ రూట్‌లో అతివేగంగా వచ్చి వంశీకృష్ణ, సునీల్‌ ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొన్నాడు. దీంతో వంశీ కృష్ణ ఎగిరి డివైడర్‌పై పడి అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. సునీల్‌కు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన జెప్టో కంపెనీ ప్రతినిధులు హుటాహుటిన 108లో క్షతగాత్రుడిని ఎంజీఎం తరలించారు. వంశీకృష్ణ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి మేద కనకరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్‌ కర్రె స్వామి తెలిపారు.

దీపావళి పండుగ పూట విషాదం నెలకొంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఆది,సోమవారాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. దీంతో ఆయా కుటుంబాలతోపాటు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement