● చెట్టు పైనుంచి పడి వ్యక్తి మృతి
● మహదేవపూర్‌లో ఘటన
కాళేశ్వరం: దీపావళి పండుగ కోసం చెట్టు ఎక్కి ఆకులు కోస్తున్న క్రమంలో జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో చోటుచేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన జైన సదానందం (59) స్థానికంగా ఓ హోటల్ నిర్వహిస్తున్నాడు. పండుగ రోజు పూజ నిమిత్తం ఆకులు (మర్రి) సేకరించడానికి అటవీ ప్రాంతంలో ఓ చెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు కాలు జారి చెట్టు పైనుంచి పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పండుగ రోజు ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.


