నేటినుంచి వేయిస్తంభాల దేవాలయంలో మాసోత్సవాలు ప్రారంభం
కార్యక్రమాల వివరాలు..
హన్మకొండ కల్చరల్: నగరంలోని శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో నేటి (మంగళవారం) నుంచి డిసెంబర్ 8వతేదీ (మంగళవారం) వరకు కార్తీకమాసోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు సంబంధింత అధికారులు ఆలయంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. కార్తీకమాసంలో పురాతన శివాలయాల్లో పూజలు నిర్వహించడం ద్వారా శివానుగ్రహం పొందొచ్చని భక్తుల విశ్వాసం. కాకతీయుల కాలంనాటి ఈ దేవాలయంలో కార్తీకమాసోత్సవాల సందర్భంగా పూజలు నిర్వహించడానికి, దీపాలు వెలిగించడానికి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు లక్షలాదిగా వస్తుంటారు. దీంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు, మంచినీరు, తదితర ఏర్పాట్లు చేశామని ఆలయ ఈఓ అనిల్‌కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. ఈ మేరకు ఉదయం వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద పాల్గొని కార్తీకమాసోత్సవాలను ప్రారంభిస్తారని తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు ప్రత్యేకపూజలు జరిగాయి.
ఈ నెల 24న కార్తీక పౌర్ణమి,
లక్షదీపోత్సవం
10వతేదీన కార్తీక శుద్ధపాఢ్యమి ఉత్సవాలు ప్రారంభం, 13వతేదీన నాగులచవితి, దేవాలయ ప్రాంగణంలో నాగులచవితిపూజలు, 16వతేదీన కార్తీకప్రథమ సోమవారం పూజలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, సాయంత్రం ప్రదోషకాల పూజలు, చతుర్వేదసేవ, 23వతేదీన కార్తీకమాస రెండో సోమవారం సామూహికరుద్రాభిషేకాలు, 24వతేదీన కార్తీకపౌర్ణమిని పురస్కరించుకుని ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, సామూహికరుద్రాభిషేకాలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8గంటల వరకు జరుగుతాయి. సాయంత్రం 6గంటల నుంచి లక్షదీపోత్సవం, 30వతేదీ మూడో సోమవారం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, 07వతేదీన నాలుగో సోమవారం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, మాసశివరాత్రి మకరలగ్నంలో ఉదయం 10:35గంటలకు శ్రీశివకల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. కల్యాణంలో పాల్గొనే భక్తులు రూ.1,116 చెల్లించి రశీదు పొందాలని ఆలయ ఈఓ అనిల్‌కుమార్ తెలిపారు.


