హత్యకు దారితీసిన అభ్యంతరాలు.. | - | Sakshi
Sakshi News home page

హత్యకు దారితీసిన అభ్యంతరాలు..

Nov 8 2026 5:05 AM | Updated on Nov 8 2026 5:05 AM

కొత్తగూడెంఅర్బన్‌: ఆమెకు అప్పటికే వివాహం జరిగి ఓ కుమారుడు ఉండగా, భర్త మృతి చెందాడు. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రాంలో పరిచయమైన కానిస్టేబుల్‌ ప్రేమించానని వెంటపడినా ఇద్దరి కులాలు వేర్వేరు కావడంతో పెద్దలు అంగీకరించలేదు. అయినా అందరినీ ఎదురించి పెళ్లి చేసుకున్న ఆయన.. గొడవ పడుతూ చివరికి హతమార్చాడు. ఈమేరకు వివరాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్‌ కొత్తగూడెం త్రీటౌన్‌ పోలీసుస్టేషన్‌లో శనివారం వెల్లడించారు.

ఇన్‌స్టాలో పరిచయం, రెండోపెళ్లి..

ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన భవా నీ(30)కి వివాహం జరిగి కుమారుడు జన్మించాక భర్త మృతి చెందాడు. ఇన్‌స్టాగ్రాంలో వీడియోలు పోస్ట్‌ చేసే ఆమెకు భద్రాద్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం గోలియాతండాకు చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ బోడా నరేందర్‌ పరిచయమయ్యాడు. ప్రేమించానని వెంటపడిన ఆయన.. వేర్వేరు కులాలు కావడంతో ఇరు కుటుంబాల పెద్దలు అడ్డు చెప్పినా రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. భవానీకి మొదటి భర్తతో జన్మించిన కుమారుడు ఆమె సోదరి వద్ద ఉంటుండగా, కొత్తగూడెం ప్రగతినగర్‌లోని అద్దె ఇంట్లో నరేందర్‌ దంపతులు కాపురం పెట్టారు. వీరికి తొలి సంతానంగా బిడ్డ జన్మించినా కొన్నాళ్లకే కన్నుమూసింది. ప్రస్తుతం భవానీ నాలుగు నెలల గర్భవతి. అయితే, పెళ్లయి రెండేళ్లు దాటినా కుటుంబీకుల నుంచి అభ్యంతరాలు కొనసాగుతుండడం, భవానీకి రెండో భర్తగా కొనసాగడం ఇష్టం లేని నరేందర్‌ ఆమెను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా 3వ తేదీన రాత్రి ఇంట్లోనే ఆమెను హతమార్చాడు.

ఆనవాళ్లు దొరకకుండా గోదావరిలో వేసి..

భవానీని హతమార్చాక మృతదేహాన్ని నరేందర్‌ తొలుత బైక్‌పై స్వగ్రామం గోలియాతండాకు తీసుకెళ్లాడు. అక్కడ పొలంలో మృతదేహాన్ని పెట్టి విషయాన్ని కుటుంబీకులకు చెప్పాడు. అనంతరం 4వ తేదీన రాత్రి 11 గంటలకు తండ్రి హరిలాల్‌ సాయంతో మృతదేహాన్ని తీసుకుని బైక్‌పైనే భద్రాచలం వెళ్లి బ్రిడ్జిపై నుంచి గోదావరి నదిలో వేశాడు. వరదలో కొట్టుకుపోతే ఆనవాళ్లు దొరకవనే భావనతో ఈ పని చేశాడు. ఈక్రమాన భవానీ కనిపించకపోవడం, నరేందర్‌ సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆమె సోదరి గుండారపు స్వరూప 6వ తేదీన కొత్తగూడెం త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు మొదలుపెట్టారు. ఆమె ఫిర్యాదులో నరేందర్‌పై అనుమానాలు వ్యక్తం చేయగా అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో విషయం బయటపెట్టాడు. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నదిలో శుక్రవారం జాలర్ల సాయంతో గాలింపు చేపట్టగా చివరకు బూర్గంపాడు మండలం వద్ద మృతదేహాన్ని గుర్తించారు. ఈమేరకు నరేందర్‌ను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనుండగా, నేరంలో ఎవరెవరి ప్రమేయం ఉందో తేల్చేందుకు దర్యాప్తు కొనసాగిస్తామని ఎస్పీ తెలిపారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, చుంచుపల్లి, త్రీటౌన్‌, వన్‌ టౌన్‌ సీఐలు ఆర్‌.వెంకటేశ్వర్లు, ఇంద్రసేనారెడ్డి, జితేందర్‌, అన్నపురెడ్డిపల్లి, త్రీటౌన్‌ ఎస్సైలు విజయ్‌సింహారెడ్డి, రమేశ్‌, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

భార్యను హతమార్చి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన కానిస్టేబుల్‌

నిందితుడి వివరాలు వెల్లడించిన

ఎస్పీ రోహిత్‌రాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement