● పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
కొత్తగూడ: ఇందిరమ్మ ఇళ్లతో పేదల జీవితాల్లో ప్రజా ప్రభుత్వం దీపావళి వెలుగులు నింపిందని పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండలకేంద్రంలో శనివారం జరిగిన ఇందిరమ్మ ఇంటి ప్రవేశ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గత పాలకులు ఏజెన్సీ గ్రామాల్లో ఒక్క ప్రభుత్వ ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రస్తుతం కొత్తగూడ, గంగారం మండలాలకు ఎక్కువ మొత్తంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. లబ్ధిదారులు త్వరగా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బక్కచింతలపల్లిలో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాన్ని సీతక్క ప్రారంభించారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో కొత్తగూడ, గంగారం మండలాల కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
ఏజెన్సీ రోడ్ల మరమ్మతులకు నిధులు
ఏజెన్సీ గ్రామాల రోడ్ల మరమ్మతులకు భారీగా నిధులు మంజూరు చేసినట్లు సీతక్క తెలిపారు. కొత్తగూడ మండలంలో దొరవారివేంపల్లి నుంచి వేలుబెల్లి వరకు రూ.10 కోట్లు, మోకాళ్లపల్లి నుంచి మొండ్రాయిగూడెం వరకు రూ.కోటి, కోనాపురం నుంచి అంకన్నగూడెం వరకు రూ.రెండు కోట్ల యాభై లక్షలు, గుండం నుంచి దబ్బిర్‌పేట వరకు రూ.7కోట్లు, కొత్తపల్లి నుంచి బోటిమీదితండా వరకు రూ.రెండు కోట్ల 50 లక్షలు, నీలంపెల్లి నుంచి దుర్గారం ఎక్స్ రోడ్డు వరకు రూ.2కోట్ల 50 లక్షలు, గుండం నుంచి పాకాల ఆర్‌అండ్‌బీ రోడ్డు వరకు రూ.3 కోట్లు, గంగారం మండలం మడగూడెం ఎక్స్ రోడ్డు నుంచి పుట్టలభూపతి వరకు రూ.3 కోట్లు, జంగాలపల్లి నుంచి దేవల్లగూడెం వరకు రూ.3 కోట్లు పంచాయతీ రాజ్ శాఖ నుంచి మంజూరు చేసినట్లు సీతక్క వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్, హౌసింగ్ పీడీ పురుషోత్తం, సంక్షేమ అధికారి శిరీష, డీడీ దేశీరాం, తహసీల్దార్ రాజు, ఎంపీడీఓ అనురాధ పాల్గొన్నారు.


