మహబూబాబాద్ రూరల్ : నిత్యావసరాలకు వచ్చిన ఓ మహిళ కనిపించని లోకాలకు తరలింది. బైక్ ఢీకొని మృతి చెందింది. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని గిరిప్రసాద్ నగర్ కాలనీలో చోటుచేసుకుంది. టౌన్ సీఐ రఘుపతిరెడ్డి కథనం ప్రకారం.. గిరిప్రసాద్ నగర్ కాలనీకి చెందిన ఎడ్ల సరోజన (58) నిత్యావసరాల నిమిత్తం శుక్రవారం సాయంత్రం తమ కాలనీ సమీపంలో గల గాయత్రి గుట్ట వద్దకు వచ్చింది. నడుచుకుంటు వెళ్తుండగా జమాండ్లపల్లి నుంచి మహబూబాబాద్ వైపునకు వస్తున్న బైక్ ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడడంతో స్థానికులు వెంటనే జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. ఈ ఘటనపై మృతురాలి కుమారుడు వేణు ఫిర్యాదు మేరకు టౌన్ ఎస్సై అంజమ్మ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారని సీఐ తెలిపారు.
● బైక్ ఢీకొని మహిళ మృతి ● జిల్లా కేంద్రంలో ఘటన


