● ఇంక్రిమెంట్ ఇచ్చేందుకు కసరత్తు
● సెలవులపై వెళ్లిన వారి ఫైల్స్ పక్కకు..
సాక్షి, మహబూబాబాద్: రెండేళ్ల క్రితం నియామకమైన ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రొబేషన్ ముగియ డంతో ఇంక్రిమెంట్‌తో పాటు సర్వీస్ రెగ్యులరైజేషన్ కోసం సిఫారసు చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా, రెండేళ్లు పనిచేస్తేనే ప్రొబేషన్ ముగిసినట్లు లెక్క. ఈమేరకు నియామకం నుంచి ఇప్పటి వరకు వివిధ రకాల సెలవులపై వెళ్లిన వారిని గుర్తించి వారి ఫైల్స్ పక్క న పెట్టి.. మిగిలిన వారి జాబితా సిద్ధం చేస్తున్నారు.
సర్వీస్ బుక్స్ పరిశీలన..
24 అక్టోబర్ 2024న డీఎస్సీలో ఎంపికై న ఉపాధ్యాయులు వెంటనే విధుల్లో చేరారు. 9 అక్టోబర్ 2026 నాటికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారి ప్రొబేషన్ ముగుస్తుంది. దీంతో ఒక ఇంక్రిమెంట్, సర్వీస్ క్రమబద్ధీకరించేందుకు సిఫారసు చేయాల్సి ఉంటుంది. జిల్లాలో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, పీఈటీలు ఇలా అన్ని విభాగాల ఉపాధ్యాయులు కలిపి మొత్తం 364 మంది ఉన్నారు. అయితే నియామక పత్రం తీసుకొని మాతృత్వం, పితృత్వం, పిల్లల సంరక్షణ, ఆరోగ్య పరిస్థితి, జీత నష్టపు సెలవుల్లో వెళ్లిన వారికి రెండు సంవత్సరాల పని దినాలు పూర్తి కావు. అలాంటి వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ఇలా జిల్లాలో 40 మందికి పైగా వివిధ రకాల సెలవులపై వెళ్లిన వారు ఉండే అవకాశం ఉందని, వారు మినహా మిగిలిన వారి ప్రొబేషన్ పూర్తి అయినట్లు ప్రకటిస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.


