● పది రోజుల వ్యవధిలో రూ.500 తగ్గింపు
● తేమసాకుతో వ్యాపారుల దోపిడీ
● ఆందోళనలో రైతులు
కేసముద్రం: ఆరుగాలం శ్రమించిన పండించిన పంటను మార్కెట్‌లో అమ్ముకుందామంటే రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో సీజన్ ప్రారంభం నుంచి పత్తికి మద్దతుకు మించి అధిక ధర పలికింది. అయితే, కొద్ది రోజులుగా ధర తగ్గుతూ వస్తుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పది రోజుల్లోనే..
కేసముద్రం మార్కెట్‌లో ఇటీవల కొత్త పత్తి అమ్మకాలు మొదలయ్యాయి. చుట్టుపక్కల గ్రామాల రైతులు పత్తిని మార్కెట్‌లో, జిన్నింగ్ మిల్లుల్లో విక్రయిస్తున్నారు. కాగా, సీజన్ ప్రారంభంలో పత్తి క్వింటాకు రూ.9,200 వరకు పలికింది. అయితే పది రోజుల నుంచి క్రమంగా ధర తగ్గుతూ వస్తోంది. అక్టోబర్ 27న గరిష్ట ధర రూ.9,177 పలుకగా.. శుక్రవారం మార్కెట్‌కు 405బస్తాల పత్తి అమ్మకాని కి రాగా, గరిష్ట ధర రూ.8,739, కనిష్ట ధర రూ.5,529 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలి పారు. పదిరోజుల వ్యవధిలో క్వింటాకు సుమారు రూ.500 వరకు ధర తగ్గడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
తేమ సాకుతో..
కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల తేమ సాకుగా చూపి వ్యాపారులు ధరలు అమాంతం తగ్గిస్తున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మార్కెట్‌కు సెలవులు ఉన్న సమయంలో చుట్టు పక్కల గ్రామాల రైతులు తమ అవసరాల నిమిత్తం పత్తిని అమ్ముకునేందుకు జిన్నింగ్ మిల్లులను, పలు దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని వ్యాపారులు ఇష్టానుసారంగా ధరలు నిర్ణయిస్తూ దోపిడీకి పాల్పడుతున్నట్లు రైతులు వాపోతున్నారు.
తేమ లేకున్నా ధర తగ్గించారు..
నాకున్న 3 ఎకరాల్లో పత్తి సాగు చేశా. సరిగా వానలు లేకపోవడంతో ఎకరానికి 8 క్వింటాళ్ల పత్తి మాత్రమే చేతికి వచ్చింది. కూలీలకు డబ్బులు ఇచ్చేందుకు 6 బస్తాల పత్తిని అమ్ముకుందామని మార్కెట్‌కు వచ్చా. క్వింటాకు రూ.8,674 రేటు పెట్టిండ్రు. గింత ధర తగ్గించారని అడిగితే తేమ ఉందని చెప్పారు. తేమ లేకున్నా నేను తీసుకువచ్చిన పత్తికి ధర తగ్గించారు.
–మట్టె అశోక్, పెద్దకోర్పోలు, నెక్కొండ
క్వింటాకు రూ.5,500 పెట్టిండ్రు
మొన్నటి వరకు కురిసిన వానకు పత్తి పంట తడిసింది. కూలీలకు డబ్బులు ఇవ్వాల్సి ఉండగా క్వింటా పత్తిని అమ్ముకుందామని కేసముద్రంలోని జిన్నింగ్ మిల్లుకు వెళ్లా. అక్కడ పత్తి బాగాలేదని చెప్పి కేవలం క్వింటాకు ధర రూ.5,500లే పెట్టిండ్రు. గింత ధర తగ్గిస్తారా అని అడిగితే, పత్తి మంచిగ లేదు.. అంతే ధర పడుతదని చెప్పిండ్రు. డబ్బులు అవసరం ఉండడంతో అమ్ముకుని నష్టపోయా.
– భూక్య రాంజీ, మహముద్‌పట్నం
గరిష్ట ధర
కనిష్ట ధర


