కలెక్టర్ స్నేహశబరీష్
మహబూబాబాద్: విద్యార్థుల్లో చదువు సామర్థ్యాలు పెంపొందించడానికి ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం విద్యాశాఖపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పిల్లలకు అర్థమయ్యే రీతిలో విద్యా బోధన చేయాలని, అన్ని పారామీటర్లలో జిల్లాను ముందు వరుసలో ఉంచాలన్నారు. పీఎం శ్రీ పాఠశాలల్లో అన్ని రకాల వసతులు కల్పించాలన్నారు. మండలస్థాయిలో విద్యాశాఖ అధికారులు నిత్యం పాఠశాలలను తనిఖీ చేసి విద్యా ప్రమాణాలు, ఎఫ్‌ఎల్‌ఎన్ తరగతుల ద్వారా అందిస్తున్న విద్యా బోధనల వివరాలు సేకరించాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డీఈఓ అనిల్‌కుమార్, ఏఎంఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
కందికొండ జాతరకు
నిధులు కేటాయించాలి
కురవి: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని మండలంలోని కందికొండ గ్రామం కందగిరి పర్వతంపై నిర్వహించే జాతరకు నిధులు కేటాయించాలని కోరుతూ హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావును శుక్రవారం ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా కందికొండ జాతర ప్రాముఖ్యత, భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన ఏర్పాట్లను మంత్రి దృష్టికి తీసుకెళ్లి, జాతర విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ విజ్ఞప్తి చేశారు.
14న ఐఎల్‌పీఏ
రాష్ట్రస్థాయి సదస్సు
మహబూబాబాద్ రూరల్: ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్(ఐఎల్‌పీఏ) 6వ రాష్ట్రస్థాయి సదస్సు ఈనెల 14న హనుమకొండ పట్టణం హంటర్‌రోడ్డులోని డీ కన్వెన్షన్ హాల్‌లో జరుగుతుందని సీనియర్ న్యాయవాది, ఐఎల్‌పీఏ రాష్ట్ర సెక్రటరీ చిల్లా రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఐఎల్‌పీఏ కరపత్రాలను బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. సదస్సుకు ముఖ్య అతిథులుగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తిరుమలదేవి, వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయమూర్తులు బి.నిర్మల, ఎం.ఆర్.సునీత, రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరవుతారన్నారు. మహిళల హక్కులు, సర్ ప్రక్రియ, సామాజిక న్యాయం, కొలీజియం సిస్టంపై సెమినార్ నిర్వహిస్తారన్నారు. ప్రతీ ఒక్క న్యాయవాది కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామి డాల సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ జంగం సిద్ధార్థ, ఆరెల్లి శ్రీనివాస్, దర్శనం రామకృష్ణ, బాలాజీ, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్, వాసం ఆనంద్, రాజమణి మందుల శ్రీనివాస్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.


