వేటుకు రంగం సిద్ధం! | - | Sakshi
Sakshi News home page

వేటుకు రంగం సిద్ధం!

Nov 6 2026 1:38 AM | Updated on Nov 6 2026 1:38 AM

సాక్షి, మహబూబాబాద్‌: ప్రభుత్వానికి కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) పెట్టకుండా జాప్యం చేసిన రైస్‌ మిల్లుల యజమానులపై చర్యలు తీసుకునేందుకు సివిల్‌ సప్లయీస్‌శాఖ సిద్ధమైంది. జిల్లాలోని పలువురు డిఫాల్ట్‌ మిల్లర్లపై చర్యలు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. బుధవారం రాష్ట్ర సివిల్‌ సప్లయీస్‌శాఖ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు జిల్లా సివిల్‌ సప్లయీస్‌శాఖ మేనేజర్‌ కార్యాలయంలోని ఫైళ్లను పరిశీలించడం ఆశాఖలో చర్చగా మారింది.

16 రైస్‌ మిల్లుల యజమానులపై ఆరా..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం మిల్లర్లు ధాన్యం తీసుకొని మరాడించి బియ్యం పెట్టాలి. అయితే జిల్లాలో సీఎంఆర్‌ పెట్టకుండా మొండికేసిన వారు 16 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 2017 నుంచి గత ఏడాది వరకు ఖరీఫ్‌, యాసంగిలో ధాన్యం తీసుకున్న మిల్లర్లు మిల్లింగ్‌ చేకుండా బహిరంగ మార్కెట్‌లో అమ్మినట్లు ప్రచారం. దీంతో ఆయా మిల్లుల్లో ధాన్యం నిల్వలు కానీ.. మరాడించిన బియ్యం కానీ లేకపోవడంతో అధికారులు విస్మయానికి గురయ్యారు. ఇలా జిల్లాలో మొత్తం రూ.30కోట్లు విలువచేసే సీఎంఆర్‌ పెట్టాల్సి ఉంది. అలాగే మిల్లర్ల వద్ద ధాన్యం నిల్వలు ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా టెండర్లు పిలిచి విక్రయించారు. అయితే మిల్లర్లు టెండర్‌దారులకు ధాన్యం ఇవ్వకుండా మొండికేయడం, ధాన్యం లేదని చెప్పడంతో వారిపై కూడా చర్యలకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఈ ధాన్యం విలువ సుమారు రూ.80కోట్లకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

రికవరీకి పకడ్బందీ ప్రణాళిక..

రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యాన్ని ప్రభుత్వం మిల్లర్లకు ఎగుమతి చేసింది. ఇలా 2017–22 మధ్యకాలంలో యాసంగి, వానాకాలం సీజన్‌లలో సీఎంఆర్‌ పెట్టని ఐదు మిల్లుల యజమానులు రూ.15కోట్లు బకాయిలు పడ్డారు. దీంతో ఇప్పటికే వారిపై ఆర్‌ఆర్‌ యాక్ట్‌కింద కేసులు నమోదు చేశారు. 2021–22 సీజన్‌లో ధాన్యం తీసుకున్న 10 రైస్‌మిల్లుల యజమానులు సుమారు రూ.15కోట్ల విలువచేసే బియ్యం పెట్టకుండా అమ్ముకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా 2022–23 సీజన్‌లో ధాన్యం దిగుమతి చేసుకున్న 21 మిల్లర్లు సీఎంఆర్‌ పెట్టలేదు. ఇలా జిల్లాలో మొత్తం రూ.130కోట్ల విలువచేసే బియ్యం మిల్లర్ల వద్దనుంచి రావాల్సి ఉంది. అదేవిధంగా 2023–24 ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం తీసుకున్న వారిలో ఐదుగురు మిల్లర్లు సీఎంఆర్‌ సకాలంలో పెట్టలేదు. ఈ మొత్తాన్ని మిల్లర్ల వద్ద నుంచి రీకవరీ చేయించే పనిలో రాష్ట్ర సివిల్‌ సప్లయీస్‌శాఖ అధికారులు ఉన్నారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేయగా ఒక్కరిద్దరు కొంత మేరకు డబ్బులు చెల్లించారు. మిగిలిన వారు మొండికేయడంతో కేసులు పెట్టినా ఫలితం లేదని భావించిన అధికారులు పోలీస్‌, రెవెనూ, సివిల్‌ సప్లయీస్‌ శాఖల సమన్వయంతో రికవరీ చేయించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా మొండి బకాయిలు పడిన వారి ఆస్తులు, వారి కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు సేకరించి కేసు నమోదు చేయడం, డబ్బులు చెల్లించకుంటే ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర అధికారులు జిల్లా అధికారులకు సర్క్యూలర్‌ జారీ చేసినట్లు తెలిసింది.

డిఫాల్ట్‌ మిల్లర్ల నుంచి సీఎంఆర్‌

రికవరీకి ప్రణాళిక

వారితో పాటు కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాల సేకరణ

వ్యాపారులతో అధికారుల

సంబంధాలపై ఆరా

రికార్డులను పరిశీలించిన రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌ అధికారులు

సహకరించిన అధికారులు ఎవరు..?

మిల్లులకు ఎగుమతి చేసిన ధాన్యం సీఎంఆర్‌ పెట్టేందుకు అధికారులు పర్యవేక్షణ చేయాలి. అయితే గతంలో జిల్లాలో పనిచేసిన అధికారులు కనీసం మిల్లులను పరిశీలించడం, ధాన్యం నిల్వలు ఉన్నాయా.. సీఎంఆర్‌ పెడుతున్నారా అనే విషయం కూడా తెలుసుకోలేదా.. తెలిసినా మౌనంగా ఉన్నారా అనేది అనుమానాలకు తావిస్తోంది. దీంతో వందశాతం సీఎంఆర్‌ పెట్టకుండా ధాన్యం అమ్ముకునేందుకు పరోక్షంగా అధికారులు కూడా సహకరించినట్లు స్పష్టమవుతోంది. ఇందుకోసం భారీగా ముడుపులు తీసుకున్నట్లు ప్రచారం. అంటే అక్రమార్కులతోపాటు, వారికి సహకరించిన అధికారులపై కూడా వేటు వేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. అయితే ఇప్పటికే పలువురు అధికారులు జిల్లా నుంచి బదిలీ కాగా.. ఒకరిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈ పరిస్థితిలో మిల్లర్లపై కేసులు.. అధికారులపై వేటు పడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement