● నాలుగు నెలలుగా ప్రభుత్వ భవనాల పరిశీలనకే పరిమితం
● నిరుద్యోగులు, యువతకు
తప్పని ఎదురుచూపులు
మహబూబాబాద్: నిరుద్యోగ యువతలో నైపుణ్యాల అభివృద్ధితో పాటు ఉపాధి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో టాస్క్(తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్) సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది. దీనిలో భాగంగా ఈ ఏడాది జూన్ నుంచి సెంటర్ ఏర్పాటు కోసం కసరత్తు చేస్తున్నారు. నాలుగు నెలలుగా ప్రభుత్వ భవనాల పరిశీలన చేస్తున్నారు. ప్రైవేట్ భవనాల్లో ఏర్పాటు చేస్తే ప్రభుత్వం నుంచి అద్దె వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని హనుమకొడ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో సెంటర్లు కొనసాగుతున్నాయి.
నైపుణ్యాభివృద్ధే లక్ష్యం..
నిరుద్యోగుల్లో నైపుణ్యాభివృద్ధే టాస్క్ సెంటర్ లక్ష్యం. ఆర్గనైజేషన్ ద్వారా శిక్షణ ఇచ్చిన అనంతరం పలు కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారు. ఆకేంద్రంలో మేనేజర్, ట్రైనర్ ఉంటారు. ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెంటర్ కొనసాగుతుంది. వారం నుంచి ఆరు నెలల కోర్సులు ఉంటాయి. బ్యాంకింగ్, ఐసెట్, నెట్‌వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ మార్కెటింగ్, ఐటీ కోర్సు, కమ్యూనికేషన్స్, డిజిటల్ మార్కెటింగ్, ఎంఎస్ ఆఫీస్ డెవలప్‌మెంట్, తదితర ప్రవేశపరీక్షలకు శిక్షణ ఇస్తారు. కాగా, సెంటర్‌లో ఫర్నిచర్, ఇతర మౌలిక వసతుల కోసం కలెక్టర్ స్నేహశబరీష్ ఇతర గ్రాంట్ నుంచి రూ.30 లక్షలు కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు.
రెండు శాఖల సమన్వయంతో..
జిల్లా పరిశ్రమలు, ఉపాధిశాఖల సమన్వయంతో టాస్క్ సెంటర్ నిర్వహణ కొనసాగుతుంది. ఉపాధి కార్యాలయంలో ఎంప్లాయ్‌మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు 6,536 మంది ఉన్నారు. కాగా, ఈ ఏడాది ఆగస్టులో 6వ తేదీ వరకు 271 మంది శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తు కోసం గూగుల్ లింక్ కూడా ఏర్పాటు చేశారు.
జూన్‌లో అద్దె భవనాల పరిశీలన..
ఈఏడాది జూన్ 30వ తేదీన జిల్లా కేంద్రంలోని తొర్రూరు రోడ్డులో, ఈదులపూసపల్లి రోడ్డులోని రెండు భవనాలను టాస్క్ రీజినల్ మేనేజర్ సునీల్‌రెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీమన్నారాయణరెడ్డి పరిశీలించారు. కానీ, ఆసెంటర్ కోసం ప్రభుత్వం నుంచి అద్దె వచ్చే అవకాశం లేదు. దీంతో ప్రభుత్వ భవనాల పరిశీలన చేపట్టారు.
పరిశీలనతోనే సరి..
ఈఏడాది జూలై నుంచి సెంటర్ కోసం ప్రభుత్వ భవనాల పరిశీలన చేపట్టారు. కాగా, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించి రెండు గదులు కావాలని రిక్వెస్ట్ చేయగా.. ఆకళాశాల ప్రిన్సిపాల్ తమ వరకే సరిపోతుందని పర్మిషన్ ఇవ్వలేదు. ఆతర్వాత ప్రభుత్వ ఐటీఐ కళాశాలతో పాటు పలు భవనాలను పరిశీలించినా అనుకూలంగా లేకపోవడంతో అక్కడితోనే ఆగిపోయారు. అయితే నిరుద్యోగులు టాస్క్ సెంటర్ ఏర్పాటు కోసం కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్నారు.
ట్రైనింగ్ సెంటర్ కోసం ప్రయత్నాలు..
పరిశ్రమల శాఖ నుంచి జిల్లాలో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ ౖట్రైనింగ్ సెంటర్ కోసం ప్రతిపాదనలు పంపారు. ఈమేరకు ఎంపీ పోరిక బలరాంనాయక్ పార్లమెంట్‌లో మాట్లాడారని, దీంతోప్రభుత్వం స్పందించిందని త్వరలో ఏర్పాటు జరుగతుందని పరిశ్రమల శాఖ అధికారులు తెలిపా రు. కాగా, ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు కోసం మానుకోట మండలంలోని రెడ్యాల గ్రామంలో ట్రైబర్ వెల్ఫేర్ శాఖకు చెందిన భవనం ఖాళీగా ఉందని గుర్తించారు. త్వరలోనే ౖట్రైనింగ్ సెంటర్ మంజూరు అవుతుందని, రూ.20 కోట్లు విడుదల అవుతాయని దానిలోనే టాస్క్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


