తొర్రూరు: ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలు మర్చిపోయిన బంగారాన్ని అప్పగించి కండక్టర్ నిజాయితీ చాటుకున్నాడు. వివరాలిలా ఉన్నా యి.. యాదాద్రి భువనగిరి జిల్లా అనాజిపురం గ్రామానికి చెందిన భీమగాని శైలజ భువనగిరి వెళ్లేందుకు మోత్కూరులో గురువారం ఉదయం ఆర్టీసీ తొర్రూరు డిపోకు చెందిన బస్సు ఎక్కింది. భువనగిరి చేరుకోగానే ప్రయాణికురాలు తన బ్యాగును మర్చిపోయి బస్సు దిగివెళ్లింది. గమనించిన బస్సు కండక్టర్ డీఎన్ రావు బ్యాగులో చూడగా.. 4 తులాల బంగారు నెక్లెస్, కొంత నగదు కనిపించింది. బ్యాగులో ఉన్న కాగితంపై ఫోన్ నంబర్ చూసి ప్రయాణికురాలికి సమాచారం అందించాడు. అనంతరం బీబీ నగర్ బస్టాండ్‌లో బంగారం, నగదును బాధిత మహిళకు కండక్టర్ అందించాడు. దీంతో తొర్రూరు డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మి కండక్టర్‌ను శాలువాతో సత్కరించారు.
24వ రోజుకు చేరిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె
మహబూబాబాద్: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మానుకోట తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం 24వ రోజుకు చేరింది. సమ్మెకు ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ బీమానాయక్ సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఉద్యోగుల 16 డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 24 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఉమాకర్, శ్రీకాంత్, త్రివేణి, రూపరాణి, రాజ్‌కుమార్, పవన్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
దళారులకు కొమ్ముకాస్తున్న కేంద్ర ప్రభుత్వం
డోర్నకల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళారులకు కొమ్ము కాస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి.నాగయ్య అన్నారు. స్థానిక అశోక్‌భవన్‌లో గురువారం జరిగిన సీపీఎం మండల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా అమ్మి దేశాన్ని ఆర్థికంగా సర్వనాశనం చేస్తోందని ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని అదానీ, అంబానీలాంటి కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతుందని వాపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా మోసం చేస్తుందని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలతో కలిసి ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, మండల కార్యదర్శి బొమ్మెన అశోక్‌కుమార్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు శెట్టి వెంకన్న, బొబ్బ లక్ష్మి, అన్నెగాని శ్రీనివాస్, దాసరి మల్లేశం, మాచర్ల సైదులు, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.
నిట్ వరంగల్‌తో ఎంఓయూ
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌తో మోసాఫ్ట్ (ఎంఓహెచ్) టెక్ ప్రైవేట్ లిమిటెడ్ గురువారం పరస్పర ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, మోసాఫ్ట్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ, సహ వ్యవస్థాపకురాలు సుభా చాగంటి ఒప్పంద పత్రాలు మార్చుకుని మాట్లాడారు. నిట్ వరంగల్ ఎంహెచ్ సాఫ్ట్ టెక్‌తో కమర్షియల్ ఎంఓయూను నిట్ వరంగల్‌లోని ఫిజిక్స్ విభాగం ఆధ్వర్యంలో ఆవిష్కరించిన స్వదేశీ ఓజోన్ ఆధారిత క్రిమి సంహారక సాంకేతికతను అందజేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. నిట్ వరంగల్‌లో ఎంఓయూ కుదుర్చుకోవడం ఆనందంగా ఉందని ఎంఓహెచ్ సాఫ్ట్‌టెక్ సీఈఓ సుభా చాగంటి తెలిపారు. కాగా, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల కోసం సాంకేతికత ఆధారిత ఉత్పత్తులను తయారు చేసేందుకు ఎంఓయూ తోడ్పడుతుందని ఎంఓహెచ్ సాఫ్ట్ టెక్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్, సహ వ్యవస్థాపకుడు, నిట్ పూర్వ విద్యార్థి శ్యామ్ మామిడి తెలిపారు. కార్యక్రమంలో నిట్ ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్లు డి.హరనాథ్, ఆర్.రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.


