● మున్సిపాలిటీల్లో అమలుకు నోచుకోని కార్యక్రమం
● నిల్వ నీటితో వ్యాధుల ముప్పు
● పట్టింపులేని అధికారులు
తొర్రూరు: జిల్లాలోని మున్సిపాలిటీల్లో ప్రతి శుక్రవారం నిర్వహించాల్సిన ఫ్రైడే డ్రై డే కార్యక్రమం అమలుకు నోచుకోవడం లేదు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడడం, దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి చర్యలు చేపట్టాల్సి ఉన్నా క్షేత్రస్థాయిలో కానరావడం లేదు. వర్షాలు, తేమ కారణంగా నీరు నిల్వ ఉంటే దోమలు పెరిగి వ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుత ఎల్‌నినో నేపథ్యం, తుపానుల కారణంగా కురుస్తున్న చిరు జల్లులతో పలువురి ఇళ్ల వద్ద నీటి నిల్వలు ఉంటున్నాయి.
అధికారుల పర్యవేక్షణ కరువు..
మున్సిపాలిటీల్లో డ్రై డే కార్యక్రమాన్ని మొదట్లో విధిగా నిర్వహించారు. కానీ కొంతకాలంగా జిల్లాలోని మున్సిపాలిటీల్లో విస్మరించారు. మున్సిపల్, వైద్య శాఖల సమన్వయంతో ప్రతీ శుక్రవారం ఫ్రైడే డ్రై డే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ అధికారుల పర్యవేక్షణ కరువై కార్యక్రమం అమలు కావడం లేదు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కొరవడడం, పాలకవర్గాలు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని విమర్శలు వస్తున్నాయి.
నీటి నిల్వతో వ్యాధుల ముప్పు..
ప్రతీ శుక్రవారం నిర్వహించే డ్రైడేలో భాగంగా ఇళ్ల ఆవరణలోని నీటి తొట్లు, పూల కుండీలు, కూలర్లు తదితర వాటిలో నీరు నిల్వ ఉండకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించారు. కౌన్సిలర్లు, వార్డు అధికారులు, మెప్మా సిబ్బంది ఆయా వార్డుల్లో పర్యటించి నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. నిల్వ ఉన్న నీటిలో దోమల లార్వా వృద్ధి చెందకుండా చూడాలి. వంద రోజుల ప్రణాళికలో భాగంగా ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడంతో సత్ఫలితాలను ఇచ్చింది. కానీ, దాన్ని కొనసాగించపోవడం, అమలుపై దృష్టి పెట్టకపోవడంతో డ్రై డే లేకుండా పోయింది. కూడళ్లలో, ఖాళీ ప్లాట్లలో కొబ్బరి బొండాలు, టీ కప్పుల్లో, కొన్ని ప్రాంతాల్లో మురుగు కాల్వల్లో సైతం నీరు నిలిచి ఉంటూ వ్యాధులను వ్యాప్తి చెందేలా దర్శనమిస్తున్నాయి. జ్వరాలకు కారణమయ్యే దోమలు వృద్ధి చెందుతున్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆసుపత్రుల్లో జ్వర బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికై నా పాలకవర్గాలు, అధికారులు స్పందించి డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహిస్తే వ్యాధుల ముప్పు తప్పే అవకాశం ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
మున్సిపాలిటీ జనాభా వార్డులు
మహబూబాబాద్ 68,935 36
తొర్రూరు 25,500 16
డోర్నకల్ 14,425 15
మరిపెడ 17,685 15
కేసముద్రం 18,480 16


