● జిల్లా ప్రధాన న్యాయమూర్తి
కె.మురళీమోహన్
మహబూబాబాద్ రూరల్ : విద్యార్థ్ధులు పుస్తక జ్ఞానంతో పాటుగా సామాజిక, చట్టపరమైన అంశాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.మురళీమోహన్ అన్నారు. జాతీ య న్యాయ సేవల దినోత్సవాన్ని (నవంబర్ 9) పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వ పోటీల విజేతలకు గురువారం బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. ఉజ్వల భవిష్యత్ కోసం విద్యార్థులు ధైర్యంగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా క్రీడలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో పాల్గొనాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బాలలకు ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టంపై తయారుచేసిన పోస్టర్లను జిల్లా జడ్జి విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్ల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


