చిన్న చర్యలే సమాజంలో
పెద్ద మార్పునకు పునాది..
నీటి సంరక్షణ..
విద్యుత్ పొదుపు,
హన్మకొండ : స్వల్ప మార్పులతో పచ్చని భవిష్యత్‌కు బాటలు వేయొచ్చని, ‘మిషన్ లైఫ్’తో పర్యావరణహిత జీవనశైలిని ప్రోత్సహించొచ్చని టీజీ రెడ్ కో ఉమ్మడి వరంగల్ జిల్లా మేనేజర్ గంథం రాజేందర్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు.. ప్రతీ పౌరుడి దైనందిన జీవనశైలిలో భాగం కావా ల్సిన సామాజిక బాధ్యత అన్నారు. ‘బ్రిక్స్ సస్టేయినబుల్ లైఫ్‌స్టైల్’ (సుస్థిరమైన జీవన శైలి) వీక్ సందర్భంగా గురువారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
7వ తేదీ వరకు బ్రిక్స్ సుస్థిర
జీవనశైలి వారోత్సవాలు..
విద్యుత్‌ను పొదుపుగా వినియోగించడం, నీటి వృథా తగ్గించడం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, చెత్తను వేరు చేయడం, మొక్కలు పెంచడం వంటి చిన్న చర్యలతోనే పర్యావరణ పరిరక్షణలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావొచ్చు. ఈ సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే లక్ష్యంతో మన దేశం ముందడుగు వేసింది. ఇందులో భాగంగా ఈ నెల 1 నుంచి 7వ తేదీ వరకు బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు నిర్వహిస్తోంది.
పర్యావరణ పరిరక్షణ ప్రజల జీవనశైలిలో
అంతర్భాగం..
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యం, నీటి కొరత, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇంధన వినియోగం, ఎలక్ట్రానిక్ వ్యర్థాల సమస్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యక్తిగత జీవనశైలిలో మార్పులు తీసుకురావడం ద్వారా పర్యావరణానికి ఎంతో మేలు చేయొచ్చు. దీనిపై అవగాహన కల్పించడమే వారోత్సవాల ప్రధాన ఉద్దేశం. పర్యావరణ పరిరక్షణను ప్రజల జీవనశైలిలో అంతర్భాగం చేయడమే మిషన్ లైఫ్ లక్ష్యం.
రోజువారీ జీవితంలో కొన్ని ముఖ్య అంశాలు తప్పనిసరిగా పాటించాలి
ప్రజలు తమ రోజువారీ జీవితంలో కొన్ని ముఖ్య అంశాలను తప్పనిసరిగా పాటించాలి. విద్యుత్ పొదుపులో భాగంగా అవసరం లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు, ఇతర విద్యుత్ పరికరాలను ఆపి విద్యుత్ వృథాను అరికట్టాలి. సంప్రదాయ ఇంధన వనరులపై ఆధారపడడం తగ్గించి సౌరశక్తి వంటి పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలి. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలి. ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు ‘మిషన్ లైఫ్’లో భాగస్వాములై విద్యుత్ పొదుపు, నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ అంశాలను ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలి.
‘మిషన్ లైఫ్’తో పర్యావరణ
పరిరక్షణకు కృషి చేయాలి
బ్రిక్స్ పర్యావరణ మంత్రుల
సమావేశంలో నిర్ణయం
ఈ నెల 1 నుంచి కొనసాగుతున్న
వారోత్సవాలు
‘సాక్షి’తో రెడ్‌కో ఉమ్మడి
వరంగల్ జిల్లా మేనేజర్ రాజేందర్
పర్యావరణ పరిరక్షణ ఒక రోజు, ఒక వారం నిర్వహించే కార్యక్రమాలతో పూర్తయ్యే అంశం కాదు. అది ప్రతీ ఒక్కరి జీవన విధానంలో నిరంతరం కొనసాగాల్సిన బాధ్యత. అవసరం లేని విద్యుత్ పరికరాలను బంద్ చేయడం, నీటిని పొదుపుగా వినియోగించడం, ప్లాస్టిక్‌కు బదులు పునర్వినియోగ వస్తువులను ఉపయోగించడం, ఆహారాన్ని వృథా చేయకపోవడం, చెత్తను వేరు చేయడం, మొక్కలు నాటడం వంటి చిన్న చర్యలే సమాజంలో పెద్ద మార్పునకు పునాది వేస్తాయి. బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు–2026 ద్వారా ప్రభుత్వ విధానాలను ప్రజల దైనందిన అలవాట్లతో అనుసంధానించి పర్యావరణ పరిరక్షణను సామూహిక బాధ్యతగా మార్చే ప్రయత్నం జరుగుతోంది.
సుస్థిర భవిష్యత్‌కు
బాటలు వేయడమే లక్ష్యం..
వ్యక్తిగత బాధ్యత, సామాజిక భాగస్వామ్యం, ప్రభుత్వ సమన్వయం, అంతర్జాతీయ సహకారం అనే నాలుగు అంశాల ఆధారంగా సుస్థిర భవిష్యత్‌కు బాటలు వేయడమే ఈ కార్యక్రమ అంతిమ లక్ష్యం. పర్యావరణాన్ని కాపాడడమంటే మన భవిష్యత్‌ను కాపాడుకోవడమేనని, ప్రతీ పౌరుడు తన జీవనశైలిలో పర్యావరణహిత మార్పులు ఆచరించాలి. ప్రజలందరూ భాగస్వాములై స్వచ్ఛ, ఆరోగ్యకర, పచ్చని సమాజం నిర్మిద్దాం.


