రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బొల్లం అజయ్(40) ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక పాత ప్రతిభ స్కూల్ ఆవరణలో గురువారం చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయాడు. ఇంటినుంచి ఉదయం 6 గంటలకు వాకింగ్‌కు వెళ్తున్నానని చెప్పిన ఆయన కొద్ది సేపటి అనంతరం పాఠశాల ఆవరణలో చెట్టుకు వేలాడుతూ విగత జీవిగా కనిపించాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అజయ్ తెలంగాణ సాధన ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో రఘునాథపల్లి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. కొన్నాళ్లుగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన అజయ్ వారం రోజులుగా బయటకు రాకుండా ఇంటిలోనే గడిపాడు. గురువారం ఉదయం నైలాన్ తా డు, సమీపంలో ఉన్న కుర్చీ తీసుకుని ప్రతిభ పాఠశాల ఆవరణలోకి వెళ్లి బాదం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలిని జనగామ రూరల్ సీఐ వేణు పరిశీలించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహంపై పడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు అభయ్‌రామ్, అభిరామ్ ఉన్నారు. భార్య అనూష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, రాజకీయ కార్యక్రమాల నిర్వహణ కోసం ఎక్కువ ఖర్చు చేయడంతో అప్పులయ్యాయని స్థానికులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే అజయ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
పలువురి నివాళి
అజయ్ మృతి సమాచారం అందుకున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు, మాజీ ఎంపీపీ వై.కుమార్‌గౌడ్, మాజీ సర్పంచ్ పోకల శివకుమార్, ఇమ్మాన్యుయేల్, శివరాజ్‌యాదవ్, కీసర దిలీప్‌రెడ్డి, మేకల నరేందర్, మంద రమేష్, కావటి భాస్కర్‌యాదవ్ తదితరులు నివాళులర్పించారు.
ఆర్థిక ఇబ్బందులే కారణం..
రఘునాథపల్లిలో ఘటన


