విమానాశ్రయ పునర్నిర్మాణానికి అడుగులు
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్
మామునూరు: ప్రధాన మంత్రి మోదీ చొరవతో మామునూరు విమానాశ్రయ పునర్నిర్మాణానికి అడగులు పడడం సంతోషకరమని జాతీయ ఎస్టీ కమిష న్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన భూ నిర్వాసితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. గురువారం మామునూరు విమానాశ్రయాన్ని కలెక్టర్ సత్యశారద, ఎయిర్‌పోర్టు అథారిటీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నటరాజ్, ఇతర శాఖల అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రూ. 203.49కోట్లతో రన్‌వే నిర్మాణ పనులకు టెండర్, తాజాగా 213.59 కోట్ల అంచనా వ్యయంతో నూతన డొమెస్టిక్ టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ టవర్ కం టెక్నికల్ బ్లాక్, ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్, ఫైర్ స్టేషన్, ఈఅండ్‌ఎం వర్క్‌షాప్ వంటి కీల మౌలిక వసతుల కల్పనకు టెండర్ల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మామునూరు విమానాశ్రయం వరంగల్ ప్రజల చిరకాల ఆకాంక్ష అన్నారు. తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధి మరింత విస్తరించాల్సి న అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆరు ఉండగా.. తెలంగాణలో ప్రస్తుతం ఒకే విమానాశ్రయం ఉందని పేర్కొన్నారు. మామునూరు విమానాశ్రయం అందుబాటులోకి వస్తే వరంగల్‌తోపాటు పరిసర జిల్లాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడి, ప్రాంతీయ అభివృద్ధికి మరింత దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ ఎయిర్‌పోర్టులో భూములు కోల్పోయిన వారిలో ఎస్సీ 55, ఎస్టీ1, బీసీలు 214, ఓసీలు 60 మంది ఉన్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణకు ముందు ప్రాధాన్యం ఇస్తామన్నారు. అటవీశాఖ అధికారి నిఖిత, బల్దియా కమిషనర్ వెంకన్న, అదనపు కలెక్టర్ ఎల్.కిశోర్‌కుమార్, డీఆర్‌ఓ విజయలక్ష్మి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సురేశ్‌బాబు, విద్యుత్ ఎస్‌ఈ ఆనందం, ఆర్డీఓ సుమ, తహసీల్దార్ ఇక్బాల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, కిసాన్ మోర్చా రాష్ట్ర నేత మల్లాడి తిరుపతిరెడ్డి,బన్న ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


