బచ్చన్నపేట : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సుదీర్ఘకాలం పోరాడిన ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ మృతి తెలంగాణ ఉద్యమకారులకు తీరని లోటని, ఆయన కుటుంబాన్ని ఆదుకునేలా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని తెలంగాణ ఉద్యమకారుల ప్రభుత్వ గుర్తింపు కేకే కమిటీ సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం, మోతె శోభన్ రెడ్డి, రాములు నాయక్ పేర్కొన్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, పీఏసీఎస్ డైరెక్టర్ వేముల లక్ష్మణ్ గౌడ్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో గురువారం ఆయన కుటుంబ సభ్యులను కమిటీ సభ్యులు పరామర్శించారు.ఈ సందర్భంగా లక్ష్మణ్ గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుడి భార్య, పిల్లలను ఓదార్చి మనోధైర్యం కల్పించారు. కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో లక్ష్మణ్ గౌడ్ చురుగ్గా పాల్గొన్నారని గుర్తుచేశారు. తెలంగాణ సాధనలో ఉద్యమకారుల త్యాగాలను ఎప్పటికీ మరువలేమని పేర్కొన్నారు. లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా సిఫార్సు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా మృతుడి భార్య స్వప్న బీఫార్మసీ అర్హత మేరకు ఉద్యోగ అవకాశం కల్పించే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆయన పిల్లల విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా అవసరమైన సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. లక్ష్మణ్ గౌడ్ కుటుంబం అధైర్యపడవద్దని, ప్రధానంగా తన భూమి పార్ట్ బీనుంచి తొలగించడంలో సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకునేలా సీఎం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
మృతుడి భార్యకు ఉద్యోగ
అవకాశం కల్పించేందుకు కృషి
ఉద్యమకారుల కుటుంబాలకు
అండగా ఉంటాం..
ప్రభుత్వ గుర్తింపు కేకే కమిటీ సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం,
మోతె శోభన్ రెడ్డి, రాములు నాయక్


