ఏటూరునాగారం: గిరిజన విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క(అనసూయ) తెలిపారు. గురువారం ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల సంక్షేమం తదితర అంశాలపై ఐటీడీఏ కార్యాలయంలో పీఓ లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు ఉన్నత ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలన్నారు. అనంతరం పీఓ లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి విద్యార్థుల సమస్యలు తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక టోల్ ఫ్రీ, వాట్సాప్ నంబర్ల సేవలను ప్రారంభించి ఆయా నంబర్లతో కూడిన పోస్టర్లను ఆవిష్కరించారు. గురుకులాలు, గిరిజన సంక్షేమ విద్యాసంస్థలు, వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు తమ సమస్యలను 1800–425–3369 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి లేదా 9493368361 వాట్సాప్ నంబర్‌కు సందేశం పంపి తెలియజేయవచ్చన్నారు. ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో మాట్లాడుతూ మంత్రి సూచనల మేరకు విద్యాసంస్థల పనితీరు, విద్యార్థుల సంక్షేమం, ఉపాధ్యాయుల బాధ్యతలు, మౌలిక సదుపాయాల నిర్వహణపై సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగా కల్యాణి, డీడీ జనార్దన్, ఏపీఓ ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి ప్రత్యేక
టోల్ ఫ్రీ, వాట్సాప్ నంబర్లు
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క


