కేయూ క్యాంపస్ : దేశ ఫార్మసీ విద్య, పరిశోధన రంగంలో తనదైన ముద్రవేసిన ప్రముఖ విద్యావేత్త, ఔషధ శాస్త్రవేత్త, కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ ఆచార్య చంద్రకాంత్ కొకాటే(79) ఇక లేరు. అనారోగ్య కారణాలతో సోమవారం రాత్రి మహారాష్ట్రలోని పూణెలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొకాటే 2001 నుంచి 2004 వరకు కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ (ఉపకులపతి)గా సేవలందించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బైంసాకు చెందిన కొకాటే కేయూ ఫార్మసీ కళాశాలలో ప్రొఫెసర్‌గా నియమిలై పిన్సిపాల్ , విభాగం అధిపతి, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్, కేయూ యూజీసీ కోఆర్డినేటింగ్ ఆఫీసర్, ఫార్మసీ డీన్‌గా కీలక పదవులు చేపట్టారు. వీసీగా కొనసాగుతూ కూడా ఫార్మాకాగ్నెసి, ఫొరెన్సిక్ ఫార్మసీ సబ్జెక్టుల విద్యార్థులకు విద్యాబోధన చేసిన ఘనత ఆయనకే దక్కింది.
ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా..
న్యూఢిల్లీలోని ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) అధ్యక్షుడిగా కూడా ప్రొఫెసర్ చంద్రకాంత్ కొకాటే బాధ్యతలు నిర్వర్తించి మన్ననలు పొందారు. ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఇండియన్ సొసైటీ ఆఫ్ ఫార్మకోగ్నసి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. యూజీసీ, న్యాక్, నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ తదితర సంస్థల కమిటీలు, సలహా మండళ్లలో కూడా పనిచేశారు.
పరిశోధన గ్రంథ రచనల్లో విశేష కృషి..
ప్రొఫెసర్ కొకాటే జాతీయ, అంతర్జాతీయ పరిశోధన పరంగా 115కిపైగా వ్యాసాలు రాశారు. ఫార్మసీ విద్యార్థులకు ఉపయోగపడే ఏడు పుస్తకాలు రచించారు. ఆయన పర్యవేక్షణలో17 మంది పరిశోధకులు పీహెచ్‌డీ పూర్తిచేశారు.
కేయూ నుంచి వలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని..
ప్రొఫెసర్ కొకాటే కేయూ వీసీగా పదవీకాలం ముగిసిన అనంతరం కొంత సర్వీస్ ఉండగానే వలంటీర్ రిటైర్మెమెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత కర్నాటక రాష్ట్రం బెల్గాంలోని కేఎల్ యూనివర్సిటీ వీసీగా పదేళ్ల పాటు సేవలు అందించారు.
వీసీ, రిజిస్ట్రార్ సంతాపం..
ఆచార్య కొకాటే మృతిపై కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి. రామచంద్రం, కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు బి. వెంకట్రామ్‌రెడ్డి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ జె. కృష్ణవేణి, మాజీ డీన్ సమ్మయ్య సంతాపం తెలిపారు. కొకాటే మృతి ఫార్మసీ విద్య, పరిశోధన రంగానికి తీరని లోటని పేర్కొన్నారు.
కొకాటేకు పురస్కారాలు..
ప్రొఫెసర్ కొకాటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 28కిపైగా పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచంలోని సుమారు 35 దేశాలను విద్య, పరిశోధన, వృత్తిపరమైన కార్యక్రమాల నిమిత్తం సందర్శించారు
ఫార్మసీ విద్యారంగంలో విశిష్టసేవలు
వీసీ, రిజిస్ట్రార్, ఫార్మసీ కళాశాల ఆచార్యుల సంతాపం


