దుగ్గొండి: మానవతావిలువలు.. కుటుంబ బాంధవ్యాలు.. రక్త సంబంధాలను సైతం పట్టించుకోని నేటి రోజుల్లో పేదవారయినా సరే తమ రక్త సంబంధానికి అండగా నిలిచారు. అయినవారంతా కాలం చేసినా నీకు మేమున్నామంటూ ముందుకు వచ్చి భరోసా ఇస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జి ల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామానికి చెందిన నంగునూరి చేరాలు, స్వరూప దంపతులు 20 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటికి వారికి ఇద్దరు పిల్లలు కుమారుడు హరీశ్, కూతురు ప్రత్యూష ఉన్నారు. అమ్మానాన్నలను కోల్పోయి అనాథలుగా మిగిలిన వీరిని స్వచ్ఛంద సంస్థలు అక్కున చేర్చుకున్నాయి. ఆలన పాలన చూశాయి. 20 ఏళ్లు అన్నాచెల్లెలు ఇద్దరూ ఒకరికి ఒ కరు తోడుగా ఉంటున్నారు. ఉన్నత విద్యనభ్యసించారు. ఇంతలోనే వారిపై విధి పగపట్టింది. హరీశ్ 10 రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. ఇదే తరుణంలో ప్రత్యూష అనాథగా మారిన తీరు వివరిస్తూ గత అక్టోబర్ 26వ తేదీన ‘ఈ చెల్లికి ఎంత కష్టమొచ్చె’ శీర్షికన ‘సాక్షి’ మెయిన్‌లో కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఈ కథనంతో ఎంతో మంది హృదయాలు కదిలాయి. ఎన్నో చేతులు ఆపన్న హస్తం అందించడానికి సిద్ధమయ్యాయి.
ఉమ్మడి ఆస్తిని రాసిచ్చిన పెద్ద, చిన్నాన్నలు..
ప్రత్యూష అనాథగా మారడంతో పేదవారయినా సరే తమకున్న ఉమ్మడి ఆస్తి 20 గుంటల పొలాన్ని పెద్దనాన్న నంగునూరి కొంరయ్య, చిన్నాన్నలు సాంబయ్య, వెంకటయ్య, రవి.. ప్రత్యూషకు రాసిచ్చారు. ఆమె పేరున రిజిస్ట్రేషన్ చేయించి మంగళవారం ప్రత్యూషకు ఆస్తిపత్రాలు అందించారు. పెళ్లితో పాటు నిరంతరం అండగా ఉండి తల్లిదండ్రులు, అన్న లేనిలోటు తీరుస్తామని ధైర్యం చెప్పి పలువురికి ఆదర్శంగా నిలిచారు.
ఊరంతా అండగా...
ప్రత్యూష దీనగాథను కనులారా వీక్షించిన గ్రామస్తులు చలించిన హృదయంతో అండగా ఉండాలని, తోచినంత సాయం చేయాలని నిర్ణయించుకుని నిధి సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి కొనసాగిస్తున్నారు. సమకూరిన నిధిని ప్రత్యూష ఉన్నత చదు వు, జీవన భృతి, రేపటి అవసరాలకు ఉపయోగపడేలా అందిస్తామని పలువురు గ్రామస్తులు తెలిపారు.
ప్రత్యూషకు భరోసా కల్పించిన
పెద్ద, చిన్నాన్నలు
కదిలించిన ‘సాక్షి’ కథనం..


