వేయిస్తంభాల దేవాలయం అపూర్వం | - | Sakshi
Sakshi News home page

వేయిస్తంభాల దేవాలయం అపూర్వం

Nov 4 2026 1:44 AM | Updated on Nov 4 2026 1:44 AM

ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ధర్మప్రవచనకులు చాగంటి కోటేశ్వరరావు

హన్మకొండ కల్చరల్‌ : వేయిరేకుల కమలం వేయిస్తంభాల దేవాలయం అపూర్వమైందని, నాడు విద్వాంసులను సంప్రదించి నిర్మించిన శివాలయం పరమాద్భుతమైందని, రుద్రేశ్వరుడిని దర్శించుకోవడం వల్ల యోగస్థితి కలుగుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మప్రవచనకులు చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ పర్యటనలో భాగంగా వరంగల్‌కు వచ్చిన చాగంటి కోటేశ్వరరావు మంగళవారం హనుమకొండలోని వేయిస్తంభాల దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్‌, ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు ఆయనను ఆలయమర్యాదలతో ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించుకున్న అనంతరం దేవాలయంలో జరుగనున్న కార్తీకమాసోత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం కార్తీకమాసం విశిష్టతను భక్తులకు వివరించారు. సృష్టిలో మెదటి జ్యోతి పరమేశ్వరుడని, రుద్రేశ్వరస్వామి జ్యోతిరూపంలో వచ్చాడన్నారు. కార్తీకమాసంలో ఈ దేవాలయంలో పూజలు జరుపుకోవడం పుణ్యఫలం ఇస్తుందన్నారు. కార్యక్రమంలో వేదపండితులు మణికంఠశర్మ, నాగిళ్ల షణ్ముఖశర్మ, కపర్తిశర్మ, బాబిశర్మ, దుర్గాప్రసాద్‌శర్మ, లంకాశివకుమార్‌శర్మ, ఎస్‌పీఆర్‌ స్కూల్‌ అధినేత జగన్‌, ఈసీజీ సంస్థ ఫౌండర్‌ శివప్రసాద్‌ పాల్గొన్నారు.

భారతీయ సంస్కృతిలో గోవుకు విశిష్టస్థానం

భారతీయ సంస్కృతిలో గోవుకు విశిష్ట స్థానం ఉందని, గోవులను స్మరించడం, సేవ చేయడం ద్వారా భక్తిభావన, కరుణ, జీవుల పట్ల ప్రేమ వంటి సద్గుణాలు పెంపొందుతాయని ధార్మికవేత్త, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. విద్యారణ్య ఆర్ష ధర్మ రక్షణ సంస్థ వరంగల్‌ ఆధ్వర్యంలో రెండురోజుల పాటు జరగనున్న చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు మంగళవారం సాయంత్రం వరంగల్‌లోని శ్రీభద్రకాళి దేవాలయం దగ్గరలోని కీర్తిగార్డెన్స్‌లో ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో ఆర్ష ధర్మ రక్షణ సంస్థ అధ్యక్షుడు నకిరేకంటి రామమూర్తి, కార్యదర్శి పోలా పశుపతి, భద్రకాళి దేవాలయం ట్రస్ట్‌ చైర్మన్‌ బండారు శివసుబ్రహ్మణ్యం, ప్రధానార్చకులు భద్రకాళి శేషు పాల్గొన్నారు. అంతకు ముందు చాగంటి కోటేశ్వరరావు శ్రీభద్రకాళి దేవాలయాన్ని సందర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement