● క్రీడలు, సంక్షేమం
ఐజీ గజారావు భూపాల్
● ఘనంగా ప్రారంభమైన తెలంగాణ పోలీస్ క్రీడలు
హసన్‌పర్తి: విధి నిర్వహణలో ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు దోహదపడుతాయని క్రీడలు, సంక్షేమం విభాగం ఐజీ గజారావు భూపాల్ అన్నారు. మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026(క్లస్టర్–డి) క్రీడా పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో హనుమకొండలో జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను ఐజీ గజారావు భూపాల్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించి మాట్లాడారు. సిబ్బంది విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచడం అభినందనీయమన్నారు. క్రీడలు శారీరక దృఢత్వం, మానసిక వికాసానికి దోహదపడుతాయన్నారు. పోటీల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసిన పోలీస్ కమిషనర్ శ్వేతతోపాటు క్రీడల ఇన్‌చార్జ్ అధికారులను ఐజీ అభినందించారు. ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, అదనపు డీసీపీలు రాయల ప్రభాకర్‌రావు, బాలస్వామి, ఏసీపీలు నర్సింహారావు, సదయ్య, మధుసూదన్, జానీ నర్సింహులు, ఏఆర్ అదనపు డీసీపీలు సురేశ్, శ్రీనివాస్, నాగయ్య, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు, క్రీడాకారులు పాల్గొన్నారు.


