కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సంఘ్ సమావేశానికి సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జాయింట్ జనరల్ సెక్రటరీ భరణిభానుప్రసాద్, సికింద్రాబాద్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు కొత్త మురళీకృష్ణ, ప్రభురాజ్, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రైల్వే ఆస్పత్రి స మస్యలతో పాటు ఆస్పత్రి ఏసీఎంఎస్ డాక్టర్ నిరంజన్ దురుసు ప్రవర్తనను కార్మికులు.. నేతల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సంఘ్ నేతలు డాక్టర్ నిరంజన్‌ను కలిసేందుకు ఆయన గదిలోకి వెళ్లగా మీరు ఎవరు అంటూ ప్రశ్నించగా నాయకులు ఆగ్రహానికి లోనయ్యారు. డాక్టర్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రైల్వే డాక్టర్ మద్యం సేవించి ఉన్నాడని, వెంటనే డ్యూటీలో ఉన్న డాక్టర్లు రక్త నమూనాలు సేకరించి రైల్వే ఉన్నతాధికారులకు పంపాలని డిమాండ్ చేశారు. దీనిపై జేజీఎస్ భరణిభానుప్రసాద్.. సికింద్రాబాద్ రైల్వే సీఎండీ నిర్మల రాజారామ్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన రైల్వే సీఎండీ ఈ ఘటనపై విచారణ చేపట్టి 24 గంటలలోపు రైల్వే డాక్టర్‌పై శాఖపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో సికింద్రాబాద్, కాజీపేట రైల్వే సంఘ్ నాయకులు, కార్మికులు శాంతించారు. ఈ ఘటనపై రైల్వే డాక్టర్ నిరంజన్‌ను వివరణ కోరగా తాను విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఓ వ్యక్తి తన గదికి వచ్చాడని, అతను ఎవరో తనకు తెలియదన్నారు. అతనితో వచ్చిన రైల్వే నాయకులు తనకు చెప్పలేదన్నారు. అతను ఎవరో తెలియక ‘హూ ఆర్ యూ’ అన్నానని డాక్టర్ నిరంజన్ తెలిపారు.
అధికారులకు ఫిర్యాదు చేసిన
నాయకులు
చర్యలు తీసుకుంటామని సీఎండీ హామీ


