కరువులో ఓ మంచి సందేశం..
రెండు ఎకరాల్లో పందిరి సాగు..
దుగ్గొండి: కరువులోనూ కూరగాయ పంటలు పండిస్తూ నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు సైతం సవాలు విసురుతున్నారు. తక్కువ నీటితో ఆధునిక పద్ధతులు పాటించి ఆదర్శంగా నిలుస్తున్నారు రైతులు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన కొక్కుల మొగిలి– విజయ దంపతులు కొన్ని సంవత్సరాల క్రితం రాజకీయాల్లో ఉండి ఎంపీటీసీగా, వైస్ ఎంపీపీగా పనిచేసి ప్రజలకు సేవలు అందించారు. అయితే వారికి ప్రజల సేవలే మిగిలాయి. కానీ ఆస్తులు కరిగిపోయాయి. వారికి చివరికి ఎకరంన్నర భూమి మిగిలింది. నీరులేక పంట పండదు. గత సంవత్సరం ఇదే గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద ఏడున్నర ఎకరాల వ్యవసాయ భూమిని రూ.1.20 లక్షలకు కౌలుకు తీసుకున్నారు. అందులో డ్రిప్పు ఉంది. మల్చింగ్‌తో పాటు కొత్త డ్రిప్ పైపుల కోసం రూ.2 లక్షలు ఖర్చు చేసి పూర్తిగా మల్చింగ్ చేశారు. మొత్తం భూమిలో వంకాయ, బీరకాయ, నల్ల, తెల్లకాకర, సోరకాయ, కీరదోస, కూరదోస, టమాట కూరగాయల పంటలు సాగు చేశారు. కరువులో బావి నుంచి వచ్చే 2, 3 గంటల సాగునీటితోనే మొత్తం భూమికి నీరు అందిస్తున్నారు. వర్షం లేకపోయినా చుక్క చుక్క నీరు ఇస్తూ పంటను కాపాడుకుంటున్నారు. వచ్చిన కూరగాయలను దళారులకు విక్రయించకుండా నేరుగా వారే స్వయంగా ఆటోలో వేసుకుని మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఇలా రోజుకు రూ. 5 వేల నుంచి 15 వరకు ఆర్జిస్తున్నారు. సంవత్సరంలో 65 రోజులు మినహా 300 రోజులు కూరగాయలు తెంపి అమ్ముతున్నారు. రోజుకు 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఖర్చులు పోగా నెలకు రూ. 90 వేల నుంచి రూ.లక్ష వరకు సంపాదిస్తున్నారు. లక్నెపల్లి నుంచి తిమ్మంపేటకు వెళ్లే ప్రధాన రహదారి వెంట ఉన్న ఈ కూరగాయల పంటలను పలువురు వాహనదారులు కాసేపు ఆగి ఆసక్తిగా తిలకిస్తున్నారు.
విజయ రహస్యమిదే..
వరి, పత్తి, మొక్కజొన్నలాంటి పంటలను నమ్ముకుంటే కరువు వస్తే పోయినట్లే. నాలుగు రకాల కూరగాయలు సాగు చేస్తే ఒకటి పోయినా ఇంకొకటి కాపాడుతుంది. డ్రిప్ పద్ధతితో పాటు మల్చింగ్ వేయడం వల్ల ఎరువు, నీరు వృథా కావడం లేదు. దళారులకు నేరుగా వరంగల్, నర్సంపేట పట్టణాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో ధరను, కూరగాయల నాణ్యతను షేర్ చేస్తూ అడిగివారికి నేరుగా అందిస్తున్నారు.
తిమ్మంపేటలో కొక్కుల మొగిలి సాగు చేసిన వివిధ రకాల కూరగాయ పంటలు, మహ్మదాపురంలో జనగం రాజు సాగు చేసిన పందిరి చిక్కుడు
డిగ్రీలు చదివి ఉద్యోగాలు రాలేదని బాధపడే యువతకు అప్పులతో సతమతమయ్యే ఈ ఇద్దరు రైతులు ఓ మంచి సందేశం ఇస్తున్నారు. భూమిని తిట్టుకోవడం కాదు, భూమితో స్మార్ట్‌గా ఆడుకోవడం నేర్చుకోవాలి. కూరగాయల్లోనే బంగారం ఉంది అని చెబుతున్నారు.
కూరగాయల సాగుతో లాభాలు
నెలకు రూ.లక్ష వరకు ఆదాయం
దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన చిన్నరైతు జనగాం రాజు–శ్వేత దంపతులకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి మాత్రమే ఉంది. బావిలో నీరు రెండుగంటలకు మించి రావడం లేదు. దీంతో ఈసారి ఎలా గట్టెక్కాలని ఆలోచించారు. రెండు ఎకరాలను నాలుగు భాగాలు చేశారు. ఎకరాకు రూ.80 వేల వ్యయంతో పందిరి వేయించారు. దానిలో 20 గుంటలకు ఒక బిట్టు చొప్పున పందిరి చిక్కుడు, పందిరి బీర, పందిరి కాకర, పందిర దొండ సాగు చేశారు. ఇలా చేయడం వల్ల 20 గుంటలకు సరిపడే నీటితో రెండు ఎకరాల్లో కూరగాయలు పండిస్తున్నారు. వీరు ప్రతి రోజు నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. రెండు ఎకరాలకు ఏడాదిలో రూ.నాలుగు లక్షల నికరదాయం ఆర్జిస్తున్నారు. తిమ్మంపేట–మహ్మదాపురం ప్రధాన రహదారి పక్కన ఉన్న చేనును రైతులు ఆగి మరీ చూసి వెళ్తున్నారు.


