ఎల్‌నినోతో పాడి పరిశ్రమకు ముప్పు | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినోతో పాడి పరిశ్రమకు ముప్పు

Nov 3 2026 1:27 AM | Updated on Nov 3 2026 1:27 AM

పశుపోషణ పద్ధతులు అవలంబించాలి

ఖిలా వరంగల్‌: ఎల్‌నినో ప్రభావంతో పాడి పరిశ్రమ తీవ్ర సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని, పాడి రైతులు ఇప్పటి నుంచే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు. వర్షపాతం తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పశుగ్రాసం, నీటి కొరత ఏర్పడడంతోపాటు పాల దిగుబడి, వెన్నశాతం తగ్గే ప్రమాదం ఉంది. ఈపరిస్థితులను ముందుగానే అంచనా వేసి పశుసంపదను కాపాడుకునేందుకు తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని పశువైద్య అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

పశుగ్రాసం కొరత..

ఎల్‌నినో ప్రభావంతో రబీ పంటల సాగు తగ్గితే వరిగడ్డి, జొన్నచొప్ప, మొక్కజొన్న చొప్ప వంటి పశుగ్రాసం కొరత ఏర్పడుతుంది. నీటి లభ్యత తగ్గడం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా పచ్చిగ్రాసం పెరుగుదల మందగిస్తుంది. ఎండల తీవ్రతతో పశువులు మేత సరిగా తీసుకోకపోవడంతో పాల దిగుబడి, పాలలో వెన్నశాతం తగ్గుతుంది. ఎదప్రక్రియ కూడా మందగిస్తుంది. నీటి కొరత వల్ల పశువులకు తాగునీరు అందించడం, వాటిని శుభ్రం చేయడం, పాడిఫాంల నిర్వహణ కష్టతరమవుతుందని అధికారులు చెబుతున్నారు.

కరువును ఎదుర్కోవాలి..

కరువు పరిస్థితులను అధిగమించేందుకు ఖరీప్‌లో లభించే వరి గడ్డి, మొక్కజొన్న చొప్ప వంటి పంట అవశేషాలను ముందుగానే సేకరించి నిల్వ చేసుకోవాలి. పంట కోతల అనంతరం పొలాల్లో మిగిలే తేమను వినియోగించుకుని తక్కువ నీటితో పెరిగే పశుగ్రాస పంటలను సాగు చేయాలి. రబీ ప్రారంభంలో అవసరానికి మించి లభించే పచ్చి గ్రాసాన్ని వృథా చేయకుండా ఎండబెట్టి నిల్వ చేసుకోవాలని ఆధికారులు సూచిస్తున్నారు.

పశువులకు పౌష్టికాహారం..

పశువులకు పౌష్టికాహారం ఇవ్వాలి. అందులో ప్రధానంగా వేరుశనగ, పెసర, మినుము వంటి పప్పు ధాన్యాల పంటల కోత అనంతరం లభించే పొట్టు, పంట వ్యర్థాలను సేకరించి పశువులకు పౌష్టికాహారంగా ఇవ్వాలి. నీటి పారుదల సౌకర్యం ఉన్న రైతులు నాణ్యమైన పశుగ్రాసాన్ని సాగు చేసి, మిగులు పచ్చిగ్రాసాన్ని సైలేజ్‌గా తయారు చేసి గాలిచొరబడకుండా నిల్వ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇది వేసవిలో పశువులకు మంచి పోషకాహారంగా ఉపయోపడుతుంది.

సబ్సిడీపై గడ్డి విత్తనాలు.

ఉమ్మడి జిల్లాలోని ప్రాథమిక పశువైద్యశాలల్లో సబ్సిడీ గడ్డి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. సీఎస్‌ఎఫ్‌ 24 ఎంఎఫ్‌ జోవర్‌ విత్తనాలు 75 శాతం రాయితీపై రైతులకు ఇవ్వనున్నట్లు వెటర్నరీ అధికారులు చెబుతున్నారు.

ముందస్తు జాగ్రత్తలతోనే

నష్టాల నివారణ

పశుగ్రాసం, నీటి కొరతను

అధిగమించాలి

వెటర్నరీ డాక్టర్‌ పల్లె రాజు సూచనలు

పాడి రైతులు పశువైద్యుల సలహాలు పాటిస్తూ వాతావరణ మార్పులకు అనుగుణంగా పశుపోషణ పద్ధతులు అవలంబించాలి. ముందస్తు ప్రణాళిక, పశుగ్రాస నిల్వలు, నీటి నిర్వహణతో పశుసంపదను కాపాడుకోవాలి. పాల ఉత్పత్తి తగ్గకుండా చూసుకుని ఆర్థిక నష్టాలను నివారించుకోవాలి.

–పల్లె రాజు, ఖిలా వరంగల్‌ ప్రాథమిక

పశువైద్య కేంద్రం పశువైద్యాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement