● పెద్దకిష్టాపురంలో ఘటన
గార్ల : కోతుల దాడిలో భార్యభర్తలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం మహబూబాబాద్ జిల్లా గార్ల సమీపంలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. గార్ల మండలం పెద్దకిష్టాపురం గ్రామానికి చెందిన గుండేటి రమేశ్, సుగుణ దంపతులు బైక్‌పై గార్ల వస్తున్నారు. ఈ క్రమంలో గార్ల సమీపంలోని శ్మశానవాటిక వద్ద కోతులు ఒక్కసారిగా బైక్‌పై వెళ్తున్న భార్యభర్తలపై దాడిచేశాయి. దీంతో భార్యభర్తలకు తీవ్రగాయాలు కాగా క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన గార్ల సీహెచ్‌సీకి తరలించి వైద్యం చేయించారు. కాగా, ఇప్పటికి పలుమార్లు కోతులు బైక్‌లపై వెళ్తున్న వారిపై దాడికి పాల్పడ్డాయని, సంబంధిత అధికారులు స్పందించి మండలంలో కోతుల బెడద నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేశారు.
కుక్కల దాడిలో గొర్రె పిల్లల మృత్యువాత
జఫర్‌గఢ్: కుక్కల దాడిలో 15 గొర్రె పి ల్లలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన సోమవారం జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లులో చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బండి కొమురయ్య తన జీవాలను రోజుమాదిరిగానే మేత కోసం బయటకు తీసుకెళ్లాడు. ఈ జీవాల పిల్లలు కొట్టంలోనే ఉన్నాయి. ఈ క్రమంలో ఎవరూ లేని సమయంలో కుక్కలు కొట్టంలోకి ప్రవేశించి గొర్రె పిల్ల లపై దాడి చేయడంతో చనిపోయాయి. ఈ ఘటనపై బాధితులు బోరున విలపించారు. కాగా, బాధితుడు కొమురయ్యకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని స్థానికులు కోరారు.


